ఉత్తర కొరియా మరోసారి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్ష నిర్వహించింది. అమెరికాను బెదిరించిన మర్నాడే ఈ పరీక్ష నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఈ పరీక్షతో కొరియా ద్వీపకల్పం మరోసారి ఉద్రిక్తంగా మారింది. ఈ విషయాన్ని జపాన్, ఉత్తరకొరియా అధికారులు ధ్రువీకరించారు. ఈ క్షిపణి జపాన్ సముద్ర జలాల్లో బుధవారం ఉదయం పడిందని తెలిపారు. ఇది తూర్పు దిశగా కొంత సేపు పయనించి జపాన్ కాలమానం ప్రకారం ఉదయం 11.15 సమయంలో సముద్ర జలాల్లో పడిందని ఆ దేశ కోస్ట్‌గార్డ్ వెల్లడించింది.
ఇక మంగళవారం రోజున ఉత్తర కొరియా నియంత్ కిమ్ సోదరి యో జోంగ్ అమెరికాపై నిప్పులు చెరిగారు. వాషింగ్టన్‌కు చెందిన నిఘా విమానాలు తమ భూభాగంలోకి చొరబడితే కూల్చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ఉత్తర కొరియా ఆరోపణలను అమెరికా తోసిపుచ్చింది. తమ సైనిక గస్తీ కార్యకలాపాలు సరిహద్దులకు లోబడే జరుగుతున్నాయని పేర్కొంది. ఈ సంఘటన జరిగిన మరునాడే అనగా ఈరోజే కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేయడం గమనార్హం.