తెలంగాణలో అధికార బిఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు మళ్ళీ మొదలైంది. ఇటీవల కాంగ్రెస్ దూకుడుగా ఉండటం..బలాన్ని పెంచుకుంటూ దూసుకురావడంతో తెలంగాణలో రాజకీయం మారిపోయింది. దీంతో మొన్నటివరకు బిజేపిని టార్గెట్ చేసిన బిఆర్‌ఎస్ నేతలు..ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అసలే ఆ పార్టీలోకి వలసలు ఎక్కువ కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో అవకాశం చూస్తున్న బిఆర్‌ఎస్ పార్టీకి..అమెరికాలో రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేసిఆర్ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంట్ తో రైతులని మోసం చేస్తుందని, నాణ్యమైన కరెక్ట్ 12 గంటల కూడా ఇవ్వడం లేదని, అయితే తెలంగాణలో 3 ఎకరాల లోపు సన్నకారు రైతులు ఎక్కువ ఉంటారని..ఆ 3 ఎకరాలకు నీరు పెట్టాలంటే 3 గంటలు చాలు అని, అందుకే రోజుకు 8 గంటల కరెంట్ సరిపోతుందని అన్నారు. అయితే తాము అధికారంలోకి వస్తే 24 గంటల కరెంట్ తీస్తామని రేవంత్ చెప్పలేదు.
కానీ ఈ లోపే ఆ మాటలపై బిఆర్‌ఎస్ రాజకీయం మొదలుపెట్టేసింది. అసలు కాంగ్రెస్ వస్తే 3 గంటలే కరెంట్ ఇస్తారని ప్రచారం చేశారు. అలాగే రేవంత్ వ్యాఖ్యలకు నిరసనలు తెలియజేయాలని బిఆర్‌ఎస్ శ్రేణులకు కేటిఆర్ పిలుపునిచ్చారు. ఇక బిఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ నేతలు అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు. అసలు ఉచిత విద్యుత్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ అని, 24 గంటల కరెంట్ ఉంటుందని, రేవంత్ వ్యాఖ్యలని బిఆర్‌ఎస్ వక్రీకరించిందని ఫైర్ అవుతున్నారు.
ఇటు రేవంత్ సైతం 24 గంటల కరెంట్ పేరుతో కనీసం 12 గంటలు కూడా నాణ్యమైన కరెంట్ ఇవ్వడం లేదని, ఇది కేసిఆర్ చేస్తున్న మోశామని..దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కేసిఆర్ దిష్టి బొమ్మ తగలబెట్టాలని పిలుపునిచ్చారు. ఇలా రెండు పార్టీల మధ్య కరెంట్ పై పోరు నడుస్తుంది.