ఇథియోపియాలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటి వానలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఆ దేశంలో మట్టిచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా కిన్‌చో షాచా గోజ్‌డీ ప్రాంతంలో సోమవారం తొలుత మట్టిచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 157 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు మంగళవారం రోజున ప్రకటించారు. వీరిలో చిన్నారులు, గర్భిణులు కూడా ఉన్నట్లు తెలిపారు.
మట్టి చరియలు విరిగి పడిన విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు, పోలీసులు బురదలో చిక్కుకున్నవారిని వెలికితీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మరోసారి మట్టిచరియలు విరిగిపడటంతో అక్కడ గుమిగూడిన సహాయక బృందాలు, ప్రజలు కూడా ఆ బురదలో చిక్కుకుపోయారు. సోమవారం రోజున 55గా ఉన్న మృతుల సంఖ్య మంగళవారం నాటికి 157కు చేరుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మరో ఐదుగురిని సురక్షితంగా వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల్లో చిక్కుకుపోయినవారిని కాపాడేందుకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.