రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఆదివారం రోజున ముగిసింది. మూడు రోజులుగా జరిగిన ఈ పోలింగ్లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు దాదాపు 88% ఓట్లు లభించినట్లు ప్రాథమిక సమాచారం. 24 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును చేపట్టగా ఈ విషయం తేలినట్లు తెలుస్తోంది. 24 ఏళ్ల పాలనను మరో ఆరేళ్లు కొనసాగించాలని పుతిన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
. ఉక్రెయిన్ యుద్ధాన్ని, పుతిన్ విధానాలను వ్యతిరేకిస్తున్నవారు పోలింగ్ కేంద్రాలకు వచ్చి సంఘీభావం ప్రకటించాలని దివంగత విపక్ష నేత నావల్నీ మద్దతుదారులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. పలు పోలింగ్ కేంద్రాల్లో అల్లర్లు చెలరేగాయి. కొన్నిచోట్ల బ్యాలెట్ పెట్టెల్లోకి ఇంకు, ఆకుపచ్చ రంగు యాంటీసెప్టిక్ ద్రావణాలను పోసేశారు. మొత్తం 16 నగరాల్లో 65 మంది నేతలు అరెస్టయ్యారు. బలమైన ప్రత్యర్థులు గానీ, బహిరంగంగా విమర్శించేవారు గానీ లేని కఠినమైన వాతావరణంలో ఎన్నికలు కొనసాగాయి. చివరిరోజు ఓటర్ల వెల్లువకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను నావల్నీ మద్దతుదారులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.