రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఐదోసారి ప్రమాణ స్వీకారం చేసిన వ్లాదిమిర్ పుతిన్ తన తొలి విదేశీ పర్యటనకు రంగం సిద్ధం చేశారు. ఐదోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి పర్యటన పుతిన్ చైనాలో చేయనున్నారు. ఈ నెల 16, 17వ తేదీల్లో పుతిన్ తమ దేశంలో పర్యటించనున్నారని చైనా విదేశాంగ శాఖ మంగళవారం రోజున ప్రకటించింది. ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు.. చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నట్లు ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు రష్యా, చైనాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 75 ఏళ్లైన సందర్భంగా జిన్‌పింగ్ ఆహ్వానంపైనే పుతిన్ చైనాను సందర్శిస్తున్నారని రష్యా విదేశాంగ శాఖ వెల్లడించింది. గడచిన ఎనిమిది నెలల్లో పుతిన్ చైనాను సందర్శించడం ఇది రెండోసారి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గత వారమే ఐరోపాలో అయిదు రోజుల పర్యటన ముగించుకొని వచ్చారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్‌తో జరిపిన చర్చల్లో రష్యాకు ఆయుధాలను కానీ, యుద్ధానికీ పౌర ప్రయోజనాలు రెండింటికీ ఉపకరించే సాధనాలను కానీ సరఫరా చేయబోమని జిన్‌పింగ్ హామీ ఇచ్చారు.