బ్రిటన్ దివంగత మహారాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆమె మరణ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి చోటుచేసుకుంటున్న అనేక పరిణామాల్లో ముఖ్యమైనది కోహినూర్ డైమండ్ విషయం. రాణి మరణానంతరం ఆ డైమండ్‌పై చాలా దేశాల కన్ను పడింది. అది మా డైమండ్ అంటే మాది అంటూ చాలా దేశాలు తమది తమకు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో దక్షిణాఫ్రికా చేరింది. అయితే ఈ దేశం డిమాండ్ చేస్తోంది కోహినూర్ డైమండ్ కాదు. మరేంటంటే..?
క్వీన్ ఎలిజబెత్-2 దండంలో ఉన్న గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా అని పిలుచుకునే కల్లినన్ డైమాండ్ తమదేనని.. తిరిగి ఇచ్చేయాలని దక్షిణాఫ్రికా డిమాండ్ చేస్తోంది. కల్లినస్-1గా పేర్కొనే ఈ 500 క్యారెట్ల డైమండ్‌ను.. దక్షిణాఫ్రికాలో 1905లో జరిపిన మైనింగ్‌లో లభ్యమైనట్టు సీఎన్‌ఎన్ పేర్కొంది. ఈ గ్రేట్ స్టార్ వజ్రాన్ని ఆఫ్రికాలోని వలస పాలకులు బ్రిటిష్ రాజకుటుంబానికి ఇవ్వగా.. ప్రస్తుతం ఆ వజ్రాన్ని రాణిదండంపై అమర్చారు.
అయితే, కల్లినన్ వజ్రాన్ని తక్షణమే దక్షిణాఫ్రికాకు అప్పగించాలంటూ తండుక్సోలో సబేలో అనే సామాజిక కార్యకర్త సామాజిక మాధ్యమాల వేదికగా డిమాండ్ చేశారు. దక్షిణాఫ్రికాతో పాటు ఇతర దేశాల ఖనిజాలు బ్రిటన్‌కు ప్రయోజనం చేకూరుస్తున్నాయని విమర్శించారు. ఈ మేరకు డైమండ్ ఇచ్చేయాలంటూ ఆన్‌లైన్‌లో పిటిషన్ ద్వారా సంతకాలు సేకరించగా.. ఇప్పటికే 6వేల మందికి సంతకాలు చేశారు.