శ్రీలంక దేశంలో రోజురోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి. గత కొన్ని నెలలుగా శ్రీలంక తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో విలవిల్లాడుతోంది. నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్ ధరలు సామాన్యుడికి అందని విధంగా పెరిగాయి. దేశం దివాలా అంచున నిలిచింది. దీంతో ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ప్రజలు, విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చి దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పరిస్థితికి కారణమైన అధ్యక్షుడు గోటబయ రాజపక్సే, ప్రధాని మహిందా రాజపక్సే లను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా నిన్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్సే అర్థరాత్రి నుంచి ఎమర్జెన్సీ విధించారు.
ఇదిలా ఉంటే ప్రధాని మహిందా రాజపక్సే తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలతో పాటు సొంత క్యాబినెట్ లోని కొంతమంది మహిందా రాజపక్సేను రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తన రాజీనామా వల్ల దేశంలో ఎంతోకొంత ఆందోళనలు తగ్గే అవకాశం ఉందని రాజపక్సే సర్కార్ భావిస్తోంది.