యూఎస్ ఎన్నికలు: ఆయన చెప్పిందే జరిగింది..!

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి జో బిడెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కానీ, జార్జియా, మిచిగాన్ రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు విషయాల్లో అక్రమాలు జరుగుతున్నాయని డొనాల్డ్ ట్రంప్ కోర్టు మెట్లు ఎక్కారు. కానీ ఆయనకు చుక్కెదురైంది. ఈ విషయంపై డెమొక్రాటిక్ పార్టీ సెనేటర్ బెర్నీ సాండర్స్ రెండు వారాల కిందటే కళ్లకు కట్టినట్లు ఎన్నికల ఫలితాలు చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయని వ్యాఖ్యాత జిమ్మీ ఫాలన్ అడిగిన ప్రశ్నకు బెర్నీ స్పందించారు.

అమెరికాలో పోస్టల్ ఓట్లు భారీ సంఖ్యలో పోలవుతాయని బెర్నీ తెలిపారు. దీని వల్ల ఎన్నికల ప్రక్రియ, ఫలితాలు ఆలస్యమవుతాయన్నారు. డెమెక్రాట్లు ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేస్తారని, రిపబ్లికన్ లు నేరుగా పోలింగ్ బూత్ లకు వెళ్లి ఓటేస్తారన్నారు. అయితే పెన్సిల్వేనియా, మిచిగన్, విస్కాన్సిన్ తదితర రాష్ట్రాల్లో కొన్ని కారణాల వల్ల ఎన్నికల ప్రక్రియ ఆలస్యమవుతుందన్నారు. దీనికి గల కారణం ఎక్కువ శాతం ప్రజలు పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించడమేనని ఆయన అన్నారు.

నవంబర్ 3న పోలింగ్ రోజు రాత్రి 10 గంటలకు ట్రంప్ కొన్ని రాష్ట్రాల్లో విజయం సాధిస్తాడని బెర్నీ చెప్పుకొచ్చారు. ఫలితాలు పూర్తిగా వెలువడకముందే ట్రంప్ ‘తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు’ అంటూ ప్రకటనలు చేస్తాడన్నారు. ఆ తర్వాత బిడెన్ పోలింగ్ పెరిగేకొద్ది తాను గెలవని కొన్ని రాష్ట్రాల్లో అక్రమాలు జరిగాయని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాడన్నారు. ఓటింగ్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, ఫలితాలపై తాను సుప్రీంకోర్టుకు కూడా వెళతాడని అన్నారు.

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిన తర్వాత బిడెన్ విజయం సాధిస్తున్నట్లు ప్రకటిస్తారన్నారు. అప్పుడు కూడా ట్రంప్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తారన్నారు. రెండు వారాల క్రితం బెర్నీ చెప్పినట్లే జరుగుతుండటంతో ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. 24 గంటల్లో 27 మిలియన్ల మంది ఈ వీడియోను చూసి కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news