చైనాలో లాక్‌డౌన్‌ ఆంక్షలతో మూడేళ్ల చిన్నారి మృతి

-

చైనా అమలు చేస్తున్న కొవిడ్ జీరో పాలసీ అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కఠినంగా అమలు చేస్తోన్న ఈ ఆంక్షలతో చైనా అధికారులకు చివరకు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. చైనాలోని లాంఝౌ నగరం దాదాపు నెలరోజులుగా లాక్‌డౌన్‌లో ఉంది.  నిత్యావసరాలతో పాటు అత్యవసర సేవలు వేగంగా అందక అవస్థపడుతున్నారు.

కార్బన్ మోనాక్సైడ్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన మూడేళ్ల బాలుడు చికిత్స అందక మరణించాడు.  తన బిడ్డను ఆసుపత్రిలో చేర్చే నిమిత్తం తాను ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు సిబ్బంది అంగీకరించలేదని, సకాలంలో అంబులెన్స్ రాలేదని ఆ చిన్నారి తండ్రి సోషల్ మీడియాలో వెల్లడించారు. దాంతో అతడు కాంపౌండ్ నుంచి ఎలాగోలా తప్పించుకొని, ట్యాక్సీ పట్టుకొని ఆసుపత్రికి వెళ్లారు. కానీ కొద్దిసేపటికే తన బిడ్డ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై సోషల్‌ మీడియాలో అధికారుల తీరుపై వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో అధికారులు దిగిరాక తప్పలేదు. ఆ బిడ్డ మృతికి గల కారణాలు వెల్లడించడంతో పాటు క్షమాపణలు తెలియజేశారు. ‘ఈ విమర్శలను మేం అంగీకరిస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం’ అని తెలిపారు. ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆ చిన్నారి తండ్రి ఎమర్జెన్సీ నంబర్‌కు ఎన్నోమార్లు ఫోన్‌చేసినా.. అంబులెన్స్‌ పంపేందుకు 90 నిమిషాలు పట్టిందని వారు అంగీకరించారు. అత్యవసర సేవలు అందించే విషయంలో ఉన్న లోపాలను ఈ ఘటన బయటపెట్టిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news