ఈ ఏడాది చివర్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఫలితాలు రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీకి షాక్ ఇచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేనివిధంగా కన్జర్వేటివ్ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలు సునాక్ ప్రధాని పీఠంపైనా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికలు, కీలకమైన ఉపఎన్నికల వ్యతిరేక ఫలితాలతో ఆయనపై ఒత్తిడి అమాంతం పెరిగిపోయింది.
బ్లాక్‌పూల్ సౌత్ ఉపఎన్నికలో టోరీ మెజారిటీ తారుమారై ఇక్కడ ప్రతిపక్ష లేబర్ పార్టీ గణనీయ విజయాలను సాధించింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న సాధారణ ఎన్నికల ముందు వచ్చిన ఈ ఫలితాలు లేబర్ పార్టీకి అనుకూలంగా మారాయని లేబర్ నాయకుడు సర్ కీర్ స్టార్‌మర్ అన్నారు. ఈ ఎన్నికల్లో తాము ఘన విజయం సాధిస్తామని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.