అమెరికాలో అరాచకం ముగిసినట్టేనా

-

అమెరికా అధ్యక్ష ఎన్నికపై సస్పెన్స్‌కు పుల్‌స్టాప్ పడింది. అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడానికి జో బైడెన్ కు లైన్ క్లియర్ అయింది. చివరి వరకూ ట్రంప్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో ఎట్టకేలకు ఓటమని అంగీకరించారు ట్రంప్‌.క్యాపిటల్‌ బిల్డింగ్‌పై ట్రంప్ మద్దతుదారుల దాడితో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.అగ్ర రాజ్యం పరువు గంగలో కలిసేలా..ప్రజాస్వామ్యం అపహస్యం పాలయ్యేలా కేపిటల్ భవనం పై దాడికి దిగే దుస్సాహసానికి ట్రంప్ మూక ఒడిగట్టడం అమెరికా ఎన్నికల చరిత్రలో మాయని మచ్చగా మారింది.

చివరి వరకూ అధికార మార్పిడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు ట్రంప్. ప్రయత్నాలు విఫలం కావడంతో ఎట్టకేలకు ఓటమిని అంగీకరించారు. అధికార మార్పిడి ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరిస్తానని చెప్పారు. తన పాలనను గొప్ప కాలంగా అభివర్ణించారు. ఎన్నికల ఫలితాలపై తాను పూర్తి అసంతృప్తిగా ఉన్నప్పటికీ.. అధికార మార్పిడి అంగీకరిస్తున్నట్టు ప్రకటించారు. కేవలం లీగల్ ఓట్లను మాత్రమే లెక్కించాలనే తమ పోరాటం కొనసాగుతుందన్నారు ట్రంప్‌.

అమెరికా చట్టసభల వేదిక క్యాపిటల్ బిల్డింగ్‌పై ట్రంప్ మద్దతు దారులు దాడి చేయడంతో ఆసమయంలో అమెరికా చట్టసభల్లో ఉన్న సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు లోనయ్యారు. అమెరికా ఎగువ, దిగు సభల సమావేశాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే..పరిస్థితి అదుపులోకి వచ్చాక అమెరికా చట్టసభ సభ్యులు మరోసారి సమావేశమై బెడెన్ విజయాన్ని ధృవీకరించారు.

అమెరికాకు మరికొద్దిరోజుల్లో కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. జనవరి 20న 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు జో బైడెన్‌. వైస్ ప్రెసిడెంట్‌గా కమలా హారీస్‌ అదే రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎలక్టోరల్ ఓట్ల ఆధారంగా… వైస్ ప్రెసిడెంట్‌ మైక్ పెన్స్‌..బైడెన్‌ పేరును అధికారికంగా ప్రకటించారు. మొత్తం ఎలక్టోరల్‌ కాలేజీలో..జో బైడెన్‌కు 306 ఓట్లు రాగా..ట్రంప్‌కు 232 ఓట్లు వచ్చాయి.

నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు. మెజార్టీ రాష్ట్రాల్లో స్పష్టమైన ఫలితం రాగా… జార్జియా, పెన్సిల్వేనియా, ఆరిజోనా, నెవెడా, మిచిగాన్‌లో బైడెన్‌ను గెలుపుపై రిపబ్లికన్లు అభ్యంతరం వ్యక్తం చేయగా… యూఎస్ కాంగ్రెస్ తిరస్కరించింది. చర్చకు ముందే వాటికి సంబంధించిన తీర్మానాలు వీగిపోయాయి. యూఎస్ కేపిటల్‌లో లాంఛనంగా జరగాల్సిన ఈ ప్రక్రియ.. ట్రంప్ మద్దతుదారుల ఆందోళన కారణంగా కొన్ని గంటలు వాయిదా పడింది. అయితే అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సెనేట్‌ను ఆర్డర్‌లోకి తీసుకురావడంతో ప్రక్రియ పూర్తయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news