ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో ప్రస్తుత పరిస్థితులు నరకప్రాయంగా మారాయని ఆవేదన చెందారు. ఇదిలాగే కొనసాగితే ఏం జరుగుతుందో ఆలోచించడానికే భయంగా ఉందంటూ వాపోయారు. వీలైనంత త్వరగా ఇజ్రాయెల్- పాలస్తీనా వివాదానికి శాశ్వత పరిష్కారాన్ని వెతకాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ పాలక మండలి సమావేశంలో తెలిపారు.
ఇథియోపియాకు చెందిన టెడ్రోస్ చిన్నతనంలో యుద్ధపరిణామాలను స్వయంగా చవిచూడటంతో ప్రస్తుతం గాజాలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ ఆయన ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగానే “ఘర్షణలు, ద్వేషం, ఆవేదన, విధ్వంసం తప్ప.. యుద్ధం ఎలాంటి పరిష్కారం ఇవ్వదని నా సొంత అనుభవంతో చెబుతున్నా. అందుకే శాంతియుతంగా, రాజకీయంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకుందాం. పరిస్థితి ఇలాగే కొనసాగితే గాజాలో ఆకలి, వ్యాధులతో మరింత మంది చనిపోతారు’’ అని టెడ్రోస్ వాపోయారు. మరోవైపు టెడ్రోస్ వ్యాఖ్యలు నాయకత్వ వైఫల్యానికి నిదర్శనమని ఐరాసలోని ఇజ్రాయెల్ రాయబారి మీరవ్ ఐలాన్ షహర్ విమర్శించారు.