మహిళామణులకు పురుషులతో పోలిస్తే స్వతహాగానే రోగనిరోధక శక్తి ఎక్కువ. మగమహారాజులు పేరుకే గాని ఆడాళ్ల పవర్ ముందు ఎందుకూ పనికిరారు.
ప్రస్తతం ఉన్న సమాచారం మేరకు వృద్ధులకే కరోనావైరస్ మరణశాసనం. కానీ, ఇప్పుడు ఇంకో విషయం కూడా బయటపడింది. అది ‘మగ’వాళ్లవడం కూడా….
అసలు కొవిడ్-19 ప్రకోపంలో లింగభేదం ఉందన్న సంగతి వుహాన్‌లో లాక్‌డౌన్ ప్రకటించిన కొద్దిరోజులకే ఆసుపత్రుల ద్వారా తెలిసింది. జనవరి 1-20 ల మధ్య వుహాన్ హాస్పిటల్‌లో చేరిన 100 మంది రోగుల గురించి షాంఘై యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ బృందం జరిపిన పరిశోధనలో మగ పేషెంట్లు ఆడవాళ్ల కంటే రెట్టింపు ఉన్నట్లు తేలింది. మరణించిన రోగుల్లో కూడా 75శాతం మగవాళ్లే ఉండటం గమనార్హం.
ఇక అప్పట్నుంచీ ఈ విషయంపై పరిశోధనలు ఊపందుకున్నాయి. ఇంగ్లండ్, వేల్స్, ఐర్లండ్‌లలో తీవ్రంగా బాధపడుతూ, ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నవాళ్లలో దాదాపు 70శాతం పురుషులే. మళ్లీ చనిపోయినవారిలో కూడా అత్యధికులు మగవాళ్లే. అమెరికాలో కూడా మగవాళ్లు 62 శాతం. విచిత్రంగా కరోనా సంక్రమణ మగ, ఆడవారికి సమానంగా ఉన్నా, సీరియస్ అవడం, చనిపోవడం మాత్రం మగవాళ్లలోనే ఎక్కువగా ఉంది.
మరో ముఖ్యమైన కారణమేమిటంటే, ధూమపానం. చైనాలో 50శాతం మంది పురుషులు సిగరెట్ తాగితే, ఆడవాళ్లు 5 శాతమే. పొగాకు పొగ వల్ల ఊపిరితిత్తుల కణాలు ఒక రకమైన మాంసకృత్తిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. ఆ మాంసకృత్తి (ప్రొటీన్)నే కరోనా వైరస్ వాడుకుని, కణానికి సోకుతుంది. అంటే, పొగ తాగడం వల్ల కణాలు వైరస్‌కు అనుకూలంగా మారతాయన్నమాట. అయితే దీనికి విరుద్ధంగా మరో వాదన కూడా ఉంది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన హువా లిండా విశ్లేషణ ప్రకారం, చైనాలో కరోనా బారిన పడి తీవ్రంగా బాధపడినవారిలో పొగ తాగేవారు కేవలం 12.5 శాతమే. బయటవున్న వారితో పోలిస్తే ఇది చాలా తక్కువ అని లిండా అభిప్రాయం.ఇంకో కారణమేమిటంటే, వృద్ధులు సాధారణంగా వృద్ధురాళ్ల కంటే ఆరోగ్యంలో వెనుకబడిఉంటారు. వృద్ధులలో బిపి, షుగర్, ఊబకాయం, కాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల అవకాశం ఎక్కువ. ఇవన్నీ కూడా కరోనా తీవ్రతను చాలా ఎక్కువ చేస్తాయి.
ఇంకొక విషయం… సర్వసాధారణంగా పురుషుల్లో కంటే స్త్రీలలో రోగ నిరోధక శక్తి సహజంగానే హెచ్చుగా ఉంటుంది. ఈ తేడావల్లే సంక్రమణ వ్యాధుల విజృంభణ కూడా ఆడవారిలో బహు స్వల్పం. దీనికి ముఖ్యమైన కారణమొకటుంది. మహిళల్లో కణానికి రెండు చొప్పున X క్రోమెజోములుండగా, పురుషుల్లో ఒక X, ఒక Y ఉంటాయి. అతి బలమైన రోగ నిరోధక జన్యువులుX క్రోమోజోములోనే ఉంటాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, కరోనా లాంటి వైరస్‌లను గుర్తించే టిఎల్‌ఆర్7 అనేవే ఈ జన్యువులు. ఆ విధంగా రెండు Xక్రోమోజోములుండటం మూలాన, ఆ జన్యువులు కూడా రెట్టింపు ఉంటాయి. అందువల్ల ఆడవారు ఇలాంటి సంక్రమణ వ్యాధులను ఎదుర్కోవడంలో మగవారి కంటే రెట్టింపు శక్తివంతులుగ ఉంటారు. అలాగే, స్త్రీ సహజమైన హార్మోన్లు ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్‌లు రోగనిరోధక శక్తిని బాగా పెంపొందిస్తాయనే వాదనా ఉంది.
సింపుల్‌గా చెప్పాలంటే, ఆడవారు, మగవారి కన్నా ఎక్కువ పరిశుభ్రత పాటిస్తారు. వ్యసనాలకు దూరంగా ఉంటారు. తమకు తెలియకుండానే స్త్రీలు ఇలా అన్ని రకాలుగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. అందుకే… ఆడది అబల కాదు సబల… మహాబల..