ఉద్యోగులకు గుడ్​న్యూస్.. ఈ ఏడాది 10.3% పెరగనున్న వేతనాలు

-

ఉద్యోగులకు గుడ్​న్యూస్. ఈ ఏడాది దేశవ్యాప్తంగా వేతనాలు 10.3% పెరిగే అవకాశం ఉందట. అయాన్‌ పీఎల్‌సీ సర్వే దీన్ని అంచనా వేసింది. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, ఆసియా దేశాల కంటే ఇక్కడే వేతన పెరుగుదల ఎక్కువగా ఉంటుందని తేల్చింది. 2022లో దేశీయంగా వేతనాలు సగటున 10.6% పెరిగిన విషయాన్ని ప్రస్తావించింది.

‘అయాన్‌ పీఎల్‌సీ 28వ వార్షిక వేతన పెంపు 2023 సర్వే’ ప్రకారం.. ఆర్థిక ఒడుదొడుకులు ఉన్నా ఉద్యోగ అధిక వలసలు ఉంటున్నందున, వేతన పెంపు రెండంకెల స్థాయిలో నమోదు కావచ్చు. 2022లో దేశంలో వలసల రేటు 21.4 శాతంగా నమోదైంది. ప్రతిభావంతుల లభ్యత -గిరాకీ మధ్య వ్యత్యాసం అధికంగా ఉన్నందున, ఈ ఏడాది కూడా వలసల రేటు ఎక్కువగా ఉండొచ్చని సర్వే తేల్చింది.

అంతర్జాతీయంగా స్థూల ఆర్థిక అనిశ్చితులున్నా, భారతీయ కంపెనీలు ప్రతిభావంతులను చేర్చుకోవడంపై ఆసక్తిగా ఉన్నందున, రెండంకెల ఇంక్రిమెంట్లు సాధ్యమేనని పేర్కొంది. 40కి పైగా రంగాల్లోని 1,400 కంపెనీల ప్రతినిధుల నుంచి సేకరించిన వివరాలతో ఈ నివేదిక రూపొందించినట్లు అయాన్‌ పీఎల్‌సీ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news