ట్రాయ్ మార్గదర్శకాలను పాటించకపోవడమే యాపిల్ చేస్తున్న పొరపాటు. నియమానుసారం, ట్రాయ్ ఆదేశాలను ధిక్కరించినవారిని నిషేధించే అధికారం ట్రాయ్‌కు ఉంది.
ఇది మొదలైంది నిజానికి టెలికాం రెగ్యులేటరీ అథారటీ ఆఫ్ ఇండియా – ట్రాయ్ (TRAI) వాళ్ల స్వంత యాప్ ‘డిఎన్‌డి 2.0 తో. దీన్ని తప్పకుండా అందరు యాప్ ప్రొవైడర్లు తమ యాప్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంచాలని ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ యాప్ టెలి మార్కెటింగ్‌ను, ఇన్సూరెన్స్ కంపెనీలు, క్రెడిట్‌కార్డ్ కంపెనీలు లాంటివి వినియోగదారుడిని విసిగించకుండా వాటిని నిషేధించడానికి ఉద్దేశించినది. అంతేకాకుండా, వారు ఫోన్ చేసినప్పుడే లేదా మెసేజ్ పంపినప్పుడే గుర్తించి బ్లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది.
ఇదే ఆ ట్రాయ్ మార్గదర్శక నియమం…
“Every Access Provider shall ensure, within six months’ time, that all smartphone devices registered on its network support the permissions required for the functioning of such Apps as prescribed in the regulations 6(2)(e) and regulations 23(2)(d),” states the TRAI directive.
కాబట్టి, ఇది ఒక్క యాపిల్ ఫోన్లనే ఉద్దేశించింది కాదు. కాకపోతే, యాపిల్‌కు ఈ యాప్‌ను తన యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంచడం ఇష్టం లేకపోవడం ట్రాయ్‌కు రుచించడం లేదు. గూగుల్ మాత్రం వెంటనే తన ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ను ప్రవేశపెట్టింది. యాపిల్ మాత్రం ఈ యాప్ ఫోన్‌లోని సమాచారాన్ని యాక్సెస్ చేసేందుకు అనుమతులు కోరుతున్నందున, అది వినియోగదారుడి వ్యక్తిగత సమాచార దోపిడీగా భావించి, దానికి అనుమతి ఇవ్వకుండా తొక్కిపట్టింది.
సమస్య ఎక్కడ మొదలైందంటే, ఈ యాప్ కేవలం ఆ ఫలానా ఫోన్ తాలూకూ అనవసర కాలర్స్‌ను బ్లాక్ చేయడమే కాకుండా, దాని కాల్ సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు ట్రాయ్‌కు చేరవేస్తుంది. దాంతో ఆ కంపెనీని గుర్తించి బ్లాక్ చేయడమే కాకుండా, తన డాటాబేస్‌లో కూడా బ్లాక్‌లిస్ట్‌లో పెడుతుంది. ఇది జరగాలంటే, ఫోన్ నుంచి కొంత ముఖ్యమైన సమాచారం… అంటే కాల్ లాగ్స్, కాంటాక్ట్ లిస్టులు.. ఇలాంటి వాటిని సేకరించాల్సివుంది. ఇక్కడే ట్రాయ్‌కి, యాపిల్‌కు విబేధాలు తలెత్తాయి. తమ వినియోగదారుడి వ్యక్తిగత సమాచారాన్ని, ప్రైవసీని ఈ యాప్ దెబ్బతీస్తుందనేది యాపిల్ ఆరోపణ.
గూగుల్ ఎలాగూ ప్రజల సమాచారంతోనే బతుకుతోంది కాబట్టి, వినియోగదారుడి వ్యక్తిగత సమాచార భద్రతపై పెద్ద పట్టింపు లేదు. అందుకే డిఎన్‌డి 2.0ని వెంటనే ప్లే స్టోర్‌లో ప్రవేశపెట్టింది. ఇబ్బడిముబ్బడిగా మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న చైనా ఫోన్లతో యాపిల్‌కు పెద్ద దెబ్బే పడుతోంది. తమ ఐఫోన్లు, మ్యాక్‌బుక్‌ల అమ్మకాలు పడిపోతున్న దృష్ట్యా, తమ ప్రాశస్త్యాన్ని కాపాడుకోవాలంటే, తమకు మాత్రమే ప్రత్యేకమైన అతిపెద్ద సౌలభ్యం ఒకటి కావాలి. అదే వినియోగదారుడి సమాచార భద్రత. దీనిమీదే యాపిల్ గేమ్ ఆడదల్చుకుంది. అందుకే భారత్ ఆదేశాలను పెడచెవిన పెట్టింది.
దీని ఫలితం ఐఫోన్‌ను నిషేధించడమే అని ఏం కాదు. నిజానికి యాపిల్‌తో ఇండియాకు మంచి సంబంధాలున్నాయి. బెంగళూరులో పెద్ద అసెంబ్లింగ్ ప్లాంటు, హైదరాబాద్‌లో అతిపెద్ద అభివృద్ది కేంద్రం, పైగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సత్సంబంధాలు..ఇలా ఉన్నాయి కాబట్టి, ఐఫోన్ బ్యాన్ చేసేంత పెద్ద నిర్ణయం భారత్ తీసుకోకపోవచ్చు. కోట్లాది ఐఫోన్లు, లక్షలాదిమంది అభిమానులుండగా ఐఫోన్ కేం భయం.?