ఐపీఎల్:ఫైనల్ చాన్స్ సన్ రైజర్స్ దేనా..జట్ల బలబలాలివే…!

-

ఐపీఎల్‌ 2020 రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఫైనల్ బెర్తులు ఖాయమనుకున్న జట్లు అనూహ్యంగా ఓటమి పాలవుతున్నాయ్. ఇక పనైపోయిందనకున్న టీమ్స్‌ విజయ ఢంకా మోగిస్తున్నాయ్‌. వారం రోజుల కింద అంచనాలు లేని సన్‌రైజర్స్‌ సూపర్‌ జోష్‌తో దూసుకెళుతోంది. వరుసగా నాలుగో విక్టరీ కొట్టిన ఆరెంజ్ ఆర్మీ కప్‌కి రెండడుగుల దూరంలో నిలిచింది. నేడు జరిగే క్వాలిపైయర్‌-2లో ఢిల్లీని బోల్తా కొట్టి ఫైనల్‌కు దూసుకెళ్లాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. మరోవైపు ముంబై చేతిలో చిత్తుగా ఓడిన ఢిల్లీ ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలన్న కసితో బరిలోకి దిగుతోంది.

టోర్నీ ఆరంభంలో తడబడినా…ఇప్పుడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ టీమ్‌ సమతూకంగా ఉంది. బెంగళూరు మ్యాచ్లో విలియమ్సన్ ఫామ్‌లోకి రావడం సన్‌రైజర్స్‌కి ప్లస్ పాయింట్‌. గాయం నుంచి సాహా కోలుకుంటే జట్టుకు తిరుగుండదు. వృద్ధిమాన్ సాహా చెలరేగితే మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై భారం తగ్గింది. వీరితో పాటు మిడిలార్డర్‌లో మనీష్ పాండే, అబ్దుల్ల్ సమద్‌ బాధ్యతగా ఆడాల్సి ఉంది. ఫైనల్‌ జట్టులో అభిషేక్ శర్మ, ప్రియామ్ గార్గ్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. ఆల్‌రౌండర్‌ జాసన్ హోల్డర్‌ రాకతో హైదరాబాద్‌ స్ట్రాంగ్‌గా మారింది. హోల్టర్ ఎంత విలువైన ఆటగాడో బెంగళూరు మ్యాచ్‌లో నిరూపితమైంది. రషీద్ ఖాన్, నదీమ్‌ స్పిన్‌ కీలకం కానుండగా…సందీప్‌ శర్మ మరోసారి చెలరేగాలని పట్టుదలగా ఉన్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో రాణించిన విధంగా.. మరోసారి చెలరేగితో వార్నర్ సేనకు తిరుగుండదు.

ఈ సీజన్‌లో ఢిల్లీ ప్రయాణం పడుతూ, లేస్తూ సాగింది. ఫస్ట్‌ క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో ముంబై చేతిలో చిత్తు చిత్తుగా ఓడింది. 14 లీగ్‌ మ్యాచ్‌లలో 8 గెలిచి, 6 ఓడింది. అయితే తొలి 9 మ్యాచ్‌ల్లో 7 గెలిచి ఊపు మీద కనిపించిన టీమ్‌ ఒక్కసారిగా తడబడింది. వరుసగా నాలుగు పరాజయాలు ఎదురైన తర్వాత చివరకు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటి ముందంజ వేసింది. అయితే ముంబై చేతిలో ఓటమి.. ఢిల్లీ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసింది. యువ, సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌తో ఢిల్లీ బ్యాటింగ్‌ విభాగం పటిష్టంగా కనిపిస్తున్నా, సమష్టిగా సత్తా చాటడంలో విఫలమవుతోంది.

ఓపెనర్‌ ధావన్ రెండు సెంచరీలు, మూడు హాఫ్‌ సెంచరీలతో అదిరే ఫామ్‌లో ఉన్నాడు. కానీ యువ ఆటగాళ్లు పృథ్వీ షా, పంత్‌ ఆశించిన స్థాయిలో ఆడకపోవడం ఢిల్లీకి ఆందోళన కలిగిస్తోంది. ఆరంభంలో భారీ స్కోర్లు చేసిన కెప్టెన్‌ అయ్యర్‌ బ్యాట్‌నుంచి తర్వాతి మ్యాచ్‌ల్లో అవే మెరుపులు  కనిపించడంలేదు.బౌలింగ్‌లో మాత్రం ఢిల్లీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. పేసర్లు రబాడ, నోర్జే, స్పిన్నర్లు అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నారు. అయితే ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు తేలిపోయారు.చావో రేవో మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించి క్వాలిఫైయర్‌-2కి చేరిన ఉత్సాహంలో ఉంది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.

Read more RELATED
Recommended to you

Latest news