ఇరాన్‌కు ఎదురుదెబ్బ.. భూక్షక్ష్యను చేరడంలో విఫలమైన ‘జాఫర్‌’

అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇరాన్‌కు గట్టి ఎదరుదెబ్బ తగిలింది. ఆదివారం సాయంత్రం వారు ప్రయోగించిన శాటిలైట్‌ ‘జాఫర్‌’ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. రాకెట్‌ నుంచి విడిపోయిన తర్వాత శాటిలైట్‌ అవసరమైన స్పీడ్‌ను అందుకోలేకపోవడమే వైఫల్యానికి కారణమని ఇరాన్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

‘రాకెట్‌లోని మొదటి దశ, రెండో దశ మోటార్లు సక్రమంగానే పనిచేశాయి. ఆ తర్వాత రాకెట్‌ నుంచి జాఫర్‌ శాటిలైట్‌ వేరుపడే ప్రక్రియ కూడా విజయవంతంగానే జరిగింది. కానీ రాకెట్‌ నుంచి విడిపోయిన తర్వాత శాటిలైట్‌ భూకక్ష్యలోకి చేరడానికి కావాల్సిన స్పీడ్‌ను అందుకోలేక పోవడంతో లక్ష్యాన్ని చేరడంలో విఫలమైంది’ అని ఇరాన్‌ రక్షణ శాఖ ప్రకటించింది.

టెహ్రాన్‌కు 230 కిలోమీటర్ల దూరంలోగల సెమ్నాన్‌ ప్రావిన్సులోని ఇమామ్‌ ఖోమినీ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి ఆదివారం రాత్రి 7.15 గంటలకు జాఫర్‌ శాటిలైట్‌ను ప్రయోగించారు. కాగా, శాటిలైట్‌ వైఫల్యంపై ఇరాన్‌ సమాచార శాఖ స్పందించింది. ఈ ప్రయోగం మమ్మల్ని నిరుత్సాహపర్చలేదని, ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకుని భవిష్యత్తులో మరిన్ని ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగిస్తామని తెలిపింది.