ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ నుంచి విశాఖ ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచిన కంభంపాటి హరిబాబు ఇప్పుడు ఆ పార్టీలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఇమడ లేకపోతున్నారా ? ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నారా ? ఇప్పుడు ఈ విషయం బయటకు పొక్కడంతో ఏపీ బీజేపీ రాజకీయాలు హీటెక్కాయా ? అంటే అవుననే చర్చలు ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉండడంతో పాటు కీలకమైన విశాఖ ఎంపీగా ఉన్న ఆయన హవా బాగా సాగింది. అటు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు అండదండలు, ఇటు చంద్రబాబు సపోర్ట్ హరిబాబుకు బాగా ఉండేది.
ఇక కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక హరిబాబు ప్రయార్టీ బాగా తగ్గిపోయింది. ఇక మొన్నటి ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటును బీజేపీ అధిష్టానం పురందేశ్వరికి ఇవ్వడంతో పాటు తాజాగా ఆమెకు ఏకంగా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చింది. ఎప్పటి నుంచో బీజేపీలోనే ఉన్న హరిబాబుకు ఎలాంటి పదవి రాలేదు. ఆయనకు రాజ్యసభతో పాటు కేంద్ర మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగినా చివరకు పార్టీ పదవి కూడా ఇవ్వని పరిస్థితి. తనను పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడం ఒక మైనస్ అయితే.. రాష్ట్ర నాయకత్వం ఆయన్ను పూర్తిగా లైట్ తీస్కొంటోంది.
కమ్మ సామాజిక వర్గానికి ప్రయార్టీ ఇవ్వాలనుకుంటే బీజేపీకి పురందేశ్వరి మంచి ఆప్షన్‌గా కనపడడంతో ఇప్పుడు కంభంపాటిని పట్టించుకోరన్నది తేలిపోయింది. దీంతో తీవ్ర అవమాన భారంతో ఉన్న ఆయన బీజేపీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం సొంత పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. బీజేపీ జాతీయ పార్టీ సభ్యుడిగా, వివాద రహితుడిగా మంచి పేరున్నా ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, వెంకయ్య కనుసన్నల్లో పార్టీని నడిపిస్తారన్న అపవాదు ఎదుర్కొన్నారు. ఈ కారణంతోనే ఆయన్ను పక్కన పెట్టిన బీజేపీ అధిష్టానం ఇతర వ్యక్తులకు ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించడంతో పాటు హరిబాబును పూర్తిగా పక్కన పెట్టేసిందన్న గుసగుసలు వస్తున్నాయి.
-Vuyyuru Subhash