రాపాక వరప్రసాద్. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి గత ఏడాది ఎన్నికల్లో జనసేన తరఫున గెలుపు గుర్రం ఎక్కిన ఏకైక ఎమ్మెల్యే. రాష్ట్ర వ్యాప్తంగా 143 స్థానాల్లో జనసేన పోటీ చేసినా.. కేవలం ఒకే ఒక స్థానాన్ని దక్కించుకుంది. దీంతో హమ్మయ్య.. అసెంబ్లీలో పరువు నిలిచిందని.. పవన్ భావించారు. ఆయనను ఘనంగా సత్కరించారు. పార్టీ పరువును నిలబెట్టాలని కూడా అప్పట్లో సూచించారు. అంతే కాదు.. రాపాక నిఖార్సయిన నేత అని.. ఎలాంటి ప్రలోభాలకు లొంగరని కూడా ప్రకటించారు పవన్ స్వయంగా.
ఇక, రాపాక కూడా తాను జనసేనలోనే ఉంటానని.. వైసీపీలోకి వెళ్తే.. తాను 152వ ఎమ్మెల్యే అవుతానని.. ఇక్కడే ఉంటే.. ఓన్లీ వన్ ఎమ్మెల్యేగా ఖ్యాతి ఉంటుందని పేర్కొన్నారు. అయితే.. ఇది జరిగిన ఆరు మాసాలకు రాపాక ప్లేట్ ఫిరాయించారు. ఓ పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేయడం .. తన వారిని పట్టుకున్నారని రాపాక యాగీ చేయడం.. తర్వాత పరిణామాల్లో ఆయన జనసేన లోనే ఉన్నా.. వైసీపీకి సంపూర్ణ మద్దతుదారుగా మారిపోవడం తెలిసిందే. ఇది ఏ ఎమ్మెల్యే అయినా.. పార్టీ ఏదైనా సరే.. చేసేదే.. ! అయితే.. పార్టీ అధినేతగా పవన్ కూడా అలా చూస్తూ ఉండడమే ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది.
ఎందుకంటే.. రాపాక.. జనసేనలోనే ఉన్నారు. ఆ పార్టీ తరఫునే ఆయన అసెంబ్లీలో మాట్లాడేందుకు టైం ఇవ్వాలని స్పీకర్‌ను కోరుతున్నారు. స్పీకర్ కూడా జనసేన అభ్యర్థిగానే ఆయనను మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నారు. కానీ, రాపాక మాత్రం ఫక్తు వైసీపీ అభ్యర్థిని మించిపోయి.. సీఎం జగన్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆయనకు భక్తుడిగా మారిపోయారు. ఇలాంటి సమయంలో పవన్.. ఆయనపై చర్యలు కోరుతూ.. స్పీకర్‌ను ఎందుకు అభ్యర్థించడం లేదు. చర్యలు తీసుకుంటారా…? తీసుకోరా? అనే విషయాన్ని పక్కన పెడితే.. అసలు పవన్ ఆదిశగా ఎందుకు అడుగులు వేయడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
నిజంగానే పవన్ ఆవిధంగా చర్యలు కోరుతూ.. లేఖ రాస్తే.. ఖచ్చితంగా స్పీకర్ రాపాకపై వేటు వేసే అవకాశం ఉండేది. లేదా న్యాయపోరాటానికి సైతం అవకాశం ఉంటుంది. కానీ.. పవనే ఎక్కడో రాజీపడుతున్నారని అంటున్నారు పరిశీలకులు. మరి దీనికి పవన్ ఏం సమాధానం చెబుతారో చూడాలి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేనే కంట్రోల్ చేసుకోని పవన్ రేపు ఓ పాతిక మంది గెలిస్తే.. ఏం చేస్తారు? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.