భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ దొరికిపోయాడు. వెస్టిండీస్ క్రికెట్ ప్లేయర్ డారెన్ సామ్మీని అతను.. ”నల్లోడు” అని అన్నది నిజమేనని తేలింది. ఇందుకు సాక్ష్యాన్ని సామ్మీ తాజాగా చూపించాడు. ఈ మేరకు ఈ విషయాన్ని సామ్మీ తాజాగా పోస్ట్ చేసిన తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలోని ఓ వీడియోలోనూ తెలిపాడు.
డారెన్ సామ్మీ 2013, 2014 సీజన్లకు గాను ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడాడు. కాగా 2014లో అప్పటి టీం మేట్స్ అయిన ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, డేల్ స్టెయిన్‌లతో కలిసి ఫొటో దిగాక.. దాన్ని ఇషాంత్ శర్మ అప్పట్లో తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేశాడు. అందులో.. ”నేను, భువీ, కాలూ (నల్లోడు), గన్ సన్‌రైజర్స్” ఉన్నామంటూ.. కాప్షన్ కూడా పెట్టాడు. అయితే సామ్మీ దాన్ని అప్పట్లో సరదాగా తీసుకున్నాడు. అతనికి ”కాలూ (kaluu)” అనే పదానికి అర్థమేమిటో తెలియదు. ఆ పదాన్ని అతను అప్పట్లో మగ గుర్రం అని అర్థం చేసుకున్నాడు. తోటి టీం మేట్లు నవ్వుతుండడంతో తనపై ఏదో జోక్ వేసి ఉంటారని సామ్మీ కూడా నవ్వాడు. ఆ ఘటన అప్పటితో ముగిసిపోయింది.
అయితే తాజాగా అమెరికాలో నల్ల జాతీయుడు ఫ్లాయిడ్ హత్య తరువాత అనుకోకుండా సామ్మీ సదరు పదం kaluu కి అర్థం తెలుసుకున్నాడు. అందుకు ”నల్లగా ఉన్నవాడు” అని అర్థం వస్తుందని తెలుసుకుని అప్పట్లో తనకు ఆ పదం వాడిన ఇషాంత్ శర్మను గుర్తు చేసుకున్నాడు. దీంతో అప్పుడు తనను ఆ పదం వాడి దూషించాడని, తనపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశాడని సామ్మీ.. ఇషాంత్‌పై తాజాగా ఆరోపణలు చేశాడు. అయితే ఇంతలోనే ఇందుకు సామ్మీ రుజువులు కూడా చూపించాడు. దీంతో ఈ విషయంపై దుమారం చెలరేగుతోంది. అయితే అప్పట్లలో కేవలం తనను మాత్రమే కాదని, శ్రీలంక జట్టుకు చెందిన తిషార పెరీరాను కూడా ”కాలూ” అని పిలిచేవారని సామ్మీ అన్నాడు. అయితే దీనిపై ఇషాంత్ శర్మ, బీసీసీఐ ఎలా స్పందిస్తారో చూడాలి.