ఓవైపు భూకంపంతో అల్లాడుతున్న సిరియాపై మరో విపత్తు దూసుకొచ్చింది. ఆ దేశ రాజధాని డమాస్కస్‌లోని నివాస భవనాలపై ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు పాల్పడింది. ఈ దాడిలో 15 మంది పౌరులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. అంతకుముందు పలుమార్లు సిరియాపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. 2022 ఆగస్టులో సిరియా మిలటరీ ఆయుధ డిపోపై ఇజ్రాయెల్ వాయుదాడులు జరిపింది. ఈ దాడిలో ఒక సిరియన్ ఆర్మీ కెప్టెన్ మరణించగా.. మరో 14 మంది గాయపడ్డారు.
ఇటీవలే సిరియాలో వరుస భూకంపాలు సృష్టించిన విధ్వంసం గురించి తెలిసిందే. భూకంపాల ధాటికి వేల మంది మరణించారు. వేల భవనాలు కుప్పకూలి వాటి శిథిలాల కింద ఇంకా కొంత మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంటే.. మరికొంత మంది మృతి చెందారు. శిథిలాల్లోఇంకా ఎవరైనా చిక్కుకుని ఉన్నారేమోనని సహాయక బృందాలు అన్వేషణ కొనసాగిస్తున్నారు. కూలిన భవనాల వద్ద జాగిలాలతో అణువణువూ జల్లెడపడుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన సహాయక బృందాలు కూడా సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నాయి.