పాకిస్థాన్ ప్రభుత్వం తాజాగా కొత్త మ్యాప్‌ను ఆమోదించడంపై భారత ప్రభుత్వం స్పందించింది. భారత దేశంలోని భూభాగాలను తమవిగా చెప్పుకుంటూ చేస్తున్న హాస్యాస్పద ప్రకటనలకు చట్టబద్ధత, అంతర్జాతీయ విశ్వసనీయత లేవని ప్రకటించింది. ‘నిజానికి, ఈ కొత్త ప్రయత్నం కేవలం పాక్ నిజ స్వరూపాన్ని బయటపెడుతోంది. టెర్రరిజం సహాయంతో భౌగోళిక విస్తరణ పట్ల తహతహను ధ్రువీకరిస్తోంది’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
పాక్ విడుదల చేసిన కొత్త మ్యాప్ లో గుజరాత్‌లోని భూభాగాలైన జునాగద్, మాన్వదార్, సర్ క్రీక్ ప్రాంతాలతో పాటు జమ్మూకశ్మీర్, లడాఖ్ లోని ప్రాంతాలను తమవేనంటూ వెల్లడించింది. అలాగే పాకిస్థానీ జాతీయుల ఆకాంక్షలకు ప్రతిబింభంగా కొత్త మ్యాప్ ఉందంటూ ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ వ్యాఖ్యానించాడు. పైగా ఈ మ్యాప్ కు పాకిస్తాన్ కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసేసింది. కాగా, ఆర్టికల్ 370 రద్దయి ఏడాది అవుతున్న నేపధ్యంలో పాకిస్తాన్ ఈ మ్యాప్ విడుదల చేయడం గమనార్హం.