- ఉలిక్కిపడ్డ టిడిపి నేతలు
- టిడిపికి లింకులున్న పలుచోట్ల ఐటి విస్తృత దాడులు
- పలు కీలక డాక్యుమెంట్ల స్వాధీనం
- తృటిలో తప్పించుకున్న మంత్రి నారాయణ
- దేవినేని ఉమ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?
- గుంటూరు, విజయవాడ, విశాఖల్లో ఐటి అధికారుల హల్‌చల్ అమరావతి
తెలుగు రాష్ట్రాలపై ఐటీ శాఖ పంజా విసిరింది. గురువారం నుంచి ఇప్పటివరకూ ఐటీ అధికారులు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 28చోట్ల తనిఖీలు నిర్వహించారు. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం నగరాలతో పాటు హైదరాబాద్‌లో కూడా ఐటీ శాఖ దాడులు జరిగాయి. వీఎస్ లాజిస్టిక్స్, స్వగృహ, సదరన్ కన్‌స్ట్రక్షన్స్‌తో సహా పలు కంపెనీల్లో ఈ దాడులు జరిపినట్లు సమాచారం. అక్రమ లావాదేవీలు, అవినీతి వ్యవహారాలు, సూట్‌కేస్ కంపెనీలు, పెట్టుబడుల అంశాలను దృష్టిలో ఉంచుకుని ఐటీ శాఖ ఈ దాడులను నిర్వహించినట్లు తెలిసింది. పలు సంస్థలకు సంబంధించిన యాజమాన్యాల పెద్దలను ఐటీ ప్రశ్నించింది. శుక్రవారంరాత్రి వరకూ ఐటీ దాడులు కొనసాగాయి. ఈ ఐటీ దాడుల వెనుక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఐటీ దాడుల గురించి మీడియాకు ప్రత్యక్షంగా సమాచారం అందటంతో అధికారులు ప్లాన్ బీని అమలు చేశారు. మొదట బెంజిసర్కిల్‌లోని నారాయణ కాలేజికి వెళ్లిన ఐటీ బృందం.. అక్కడ మీడియా ఉండటంతో అక్కడి నుంచి బందర్ రోడ్డుకు వెళ్లిపోయారు. తమను వెంబడించవద్దని మధ్యాహ్నం తర్వాత తామే వివరాలు వెల్లడిస్తామని ఐటీ అధికారులు చెప్పారు.
జగ్గయ్యపేట దగ్గరలోని ప్రీకాస్ట్ ఇటుకల పరిశ్రమపై ఐటీ దాడులు చేసింది. మీడియా ఉండటంతో ప్లాన్ ఏ అమలు చేయలేకపోయారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆరు బృందాలు వెనక్కి తిరిగి వచ్చాయని టీడీపీ నేతలకు సమాచారం అందినట్లు తెలిసింది. రెండుమూడు రోజుల్లో టీడీపీ నేతలు, అనుచరులకు చెందిన ఆస్తులు, ఆఫీసులపై ఐటీ దాడులు జరుగుతాయని అధికార పార్టీకి సమాచారం అందడంతో నేతలతో చంద్రబాబు సంప్రదింపులు జరిపారు. ఇప్పటికీ కావలి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బీద మస్తాన్ రావు వ్యాపార సంస్థపై ఐటీ దాడులు జరగడం, నారాయణ విద్యా సంస్థల్లో తనిఖీలు చేసేందుకు ఐటీ ప్రయత్నించడంతో ఇది కేవలం టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్య అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మోదీకి తనకు నచ్చని వారిపై ఈడీ, ఐటీలతో దాడులు చేయించడం అలవాటుగా మారిందని, భయపడాల్సిన అవసరం లేదని.. బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలని నేతలకు టీడీపీ అధినేత సూచించారు. ఇదిలా ఉంటే.. ప్రకాశం జిల్లాలో కూడా ఐటీ దాడులు కలకలం రేపాయి.
కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే పోతుల రామారావు, ఆయన కుటుంబసభ్యుల కంపెనీల్లో సోదాలు జరిగినట్లు సమాచారం. టంగుటూరు మండలం చెరువుకొమ్ముపాలెంలోని సదరన్ గ్రానైట్స్ కంపెనీలో ఐటీ సోదాలు నిర్వహించింది. అలాగే జరుగుమిల్లి మండలం కె.బిట్రగుంటలో సదరన్ ట్రోపికల్ ఫుడ్స్ ఆఫీసులో ఐటీ తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. ఈ తనిఖీల్లో ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సంబంధించిన లింకు పత్రాలు దొరికినట్లు తెలిసింది. చంద్రబాబుతో అందుబాటులో ఉన్న మంత్రులు సమావేశమైన అరగంటలోనే సదరన్ కంపెనీలపై ఐటి దాడుల వ్యవహారం బయటకు రావడంతో దేవినేని ఉమా అర్దంతరంగా ముఖ్యమంత్రి వద్ద నుంచి లేచివెళ్లిపోయారు..
సదరన్ డెవలపర్స్ అండ్ కన్‌స్ట్రక్షన్స్ పేరుతో అమరావతిలో భూ లావాదేవీలు జరిపినట్లు ఐటీ గుర్తించింది. మొదట శుక్రవారం ఉదయం విజయవాడ నారాయణ కళాశాలకు వచ్చిన ఐటీ అధికారులు ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమ కళాశాలలపై ఎటువంటి ఐటీ దాడులు జరగలేదని ఆ తరువాత మంత్రి నారాయణ ప్రకటించారు.
టీడీపీ నేతలపై మోదీ ప్రభుత్వం కక్షసాధిస్తోందని మంత్రి నారాయణ నెల్లూరులో ఆరోపించారు. బీదా మస్తాన్‌రావు సంస్థలపై ఐటీ దాడులు కుట్రపూరితమే అని మండిపడ్డారు. తమిళనాడు, కర్ణాటకలో మాదిరిగా ఏపీపై పెత్తనం చేయాలని భావిస్తున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.