ఏపీ రైతులకు జగన్ శుభవార్త… వాటిలో 80శాతం సబ్సిడీ

శాసనసభలో వరద నష్టంపై ప్రకటన చేసింది జగన్ సర్కార్. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకూ 34 మంది మృతి చెందారని.. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేసింది జగన్ సర్కార్. భారీ వర్షాల కారణంగా 8 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని.. వరదలతో 5.33 లక్షల రైతులకు నష్టపోయారని వెల్లడించింది. నెల్లూరు, చిత్తూరు,కడప 10 కోట్ల రూపాయలు, అనంతపురం కలెక్టర్ల వద్ద 5 కోట్ల రూపాయల నగదును సిద్దంగా ఉంచామని.. పంట నష్టం కోసం ఎన్యూమరేషన్ మొదలు పెడుతున్నామని స్పష్టం చేసింది.

అలాగే 80 శాతం రాయితీతో విత్తనాలు సరఫరా చేస్తామని.. వరద ప్రభావిత ప్రాంతాలకు రెండు హెలికాప్టర్ల ద్వారా బాధితులకు సాయం అందించామని తెలిపింది సర్కార్. వరదల కారణంగా పునరావాస క్యాంపుల్లోని వారికి రెండు వేల రూపాయల ఆర్ధిక సాయం చేస్తున్నామని.. వ్యవసాయ పంటలు 2.63 హెక్టార్లు, 24 వేల ఉద్యాన పంటలు నీట మునిగిపోయాయని వెల్లడించింది. ప్రాథమికంగా 8 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టు తేలిందని.. నష్ట వివరాలను సమగ్రంగా తెలుసుకునేందుకు ఎన్యుమరేషన్ చేపడుతున్నామని పేర్కొంది.