ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ఉన్న భూములను ఇళ్ళ పట్టాలుగా పంపిణీ చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఉగాది రోజు ఆ భూములను పేదలకు పంచే విధంగా జగన్ సర్కార్ సిద్దమవుతుంది. అయితే ఇప్పుడు ఆ భూములను పేదలకు పంచె అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చారని, ఇళ్ళ పట్టాల కోసం కాదని హైకోర్ట్ అంటుంది.
ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఏమో బయటి వారికి ఇళ్ళ పట్టాలు ఇవ్వొద్దని సిఆర్డిఏ చట్టంలో పొందు పరచలేదని వాదిస్తుంది. పిటిషనర్ల తరఫున మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, లాండ్ పూలింగ్ స్కీమ్ కింద తీసుకున్న భూమిలో 5 శాతాన్ని భవిష్యత్తులో అమరావతికి వలసవచ్చే పేదలకు తక్కువ ధరలకు ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు కేటాయించారని కోర్ట్ కి వివరించారు.
అంతే గాని… ఒకేసారి గంపగుత్తగా కాదని పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల కాలంలో అమరావతికి వచ్చి స్థిరపడే వారికోసం ఆ భూములు కేటాయించాలని సీఆర్డీఏ చట్టం లక్ష్యమన్నారు ఆయన. ఒకేసారి అందరికీ ఇళ్ల పట్టాలు అందించడం ద్వారా భూసమీకరణ స్ఫూర్తి, సీఆర్డీఏ చట్టానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది అని కోర్ట్ కి వివరించారు. ఇలా ఇవ్వడం తప్పని ఆయన కోర్ట్ కి వివరించారు.
గుంటూరు – కృష్ణా జిల్లాల కలెక్టర్లతో చర్చించిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా భూమి అందుబాటులో లేదని అందుకే సీఆర్డీఏ పరిధిలో భూములు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పుకొచ్చారు అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్. ఇప్పటికే ప్రభుత్వం నాలుగు వేల ఎకరాల వరకు భూమిని చదును చేస్తుంది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది.