ఇప్పుడు ఇదే విషయంపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బలవన్మరణం అనంతరం.. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ తన రాజకీయ వ్యూహానికి వేగం పెంచింది. జగన్ ప్రభుత్వం వేధించిన కారణంగానే కోడెల ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని తాజాగా గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అంతేకాదు, గవర్నర్ విశ్వభూషణ్‌ను కలిసి ఫిర్యాదులు కూడా చేశారు.
అదే సమయంలో బాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా ఉన్నాయి. అసెంబ్లీ ఫర్నిచర్ విషయంలో కోడెలపై దొంగతనం కేసులు పెట్టారని, అలా అయితే, ప్రస్తుత మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దొంగలేనని వ్యాఖ్యానించారు. ఇది ఎలా షింక్ అవుతుందో ఆయనకే తెలియాలి. అధికారులైనా, అధికారంలో ఉన్న రాజకీయ నేతలైనా.. కూడా ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన ప్రతి వస్తువును అధికారిక కార్యకలాపాల కోసం వినియోగించుకోవడంలో తప్పులేదని రూల్సు చెబుతున్నా.. సొంత ఇళ్లకు, క్యాంపు కార్యాలకు తరలించే విషయంలో సంబంధిత ప్రభుత్వ శాఖల అనుమతులు కానీ, సీఎంగా ప్రభుత్వాధినేత అనుమతి కానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం బాబుకు తెలియదని అనుకోలేం.
పోనీ.. కోడెల విషయంలో ప్రభుత్వం తప్పు చేసిందని, ఇప్పుడు చెబుతున్న చంద్రబాబుకు ఆయన జీవించి ఉండగా.. ఈ విషయం గుర్తులేదా? చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎలా అనగలిగారు!? వర్ల రామయ్య కోడెలను తప్పుపడుతూ ఇచ్చిన స్టేట్‌మెంటును ఎందుకు ఖండించలేక పోయారు? పోనీ.. మీరే స్వయంగా రంగంలోకి దిగి.. ఏం జరిగిందో మేం విచారించి ప్రభుత్వానికి చెబుతామని ఎందుకు చెప్పలేక పోయారు.
అదికూడా కాదు.. నాకు తెలిసే ఇదంతా జరిగింది! అని ఒక్క మాట అని ఉన్నా.. కోడెల మనోనిబ్బరంతో ఉండేవారు కదా..? ఇవన్నీ ఆనాడు మీకు కనిపించలేదు. ఇప్పుడు సెంటిమెంటుగా మారి.. మీకు ఏమేరకు ప్రయోజనం చేకూరుతుందా? అనే ఆలోచనలో చేస్తున్న ఈ కోడెల సెంటిమెంటు ప్రయోగం వికటించడం ఖాయం. ప్రజలు మీరు చెప్పినవన్నీ విని, నమ్మి ఉంటే.. మళ్లీ మీకే అధికారం దక్కి ఉండేది..! అయినా .. మీరు మారక పోతే… ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు..!