నాయిబ్రహ్మాణులకు జగన్ సర్కార్ శుభవార్త. ఆలయ పాలకవర్గాల్లో ఓ ధర్మకర్తగా నాయి బ్రాహ్మణులను నియమించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 610 ఆలయాలకు పాలకవర్గాలను నియమించాల్సి ఉండగా, వీటన్నింటిలో నాయి బ్రాహ్మణుల నుంచి ఒకరు చొప్పున సభ్యుడిగా చేర్చాలని పేర్కొంది.
దేవాదాయ శాఖకు చెందిన 97 ఆలయాల్లో 1,121 మంది నాయి బ్రాహ్మణులు క్షురకులుగా ఉన్నారని, 1,169 ఆలయాల్లో భజంత్రీలుగా పనిచేస్తున్నారని, 100 మంది చెవులు కొట్టేవారు, 500 మంది పల్లకి మోసే విధులు నిర్వహిస్తున్నట్లు వివరించింది. దేవాలయ సాంప్రదాయాలతో వీరికి అనుబంధం ఉండడంతో, నిర్వాహణలో వీరికి భాగస్వామ్యం కల్పించేలా ప్రతి ట్రస్ట్ బోర్డులో ఒకరికి సభ్యుడుగా అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 3న జారీ అయిన ఈ ఆర్డినెన్స్ సోమవారం బయటకు వచ్చింది.