నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భద్రతను అధికారులు కుదించారు. భద్రతా సిబ్బందిని 2+2 నుంచి 1+1కి తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన పత్రంపై కోటంరెడ్డి సంతకం చేశారు.
ఇటీవల వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి కూడా పోలీసులు భద్రతను తగ్గించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ పార్టీ వీడేందుకు సిద్ధమైన నేపథ్యంలోనే భద్రత కుదించినట్లు తెలుస్తోంది.గత కొంతకాలంగా సొంత పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదన్న కారణంతో పార్టీ నుంచి దూరంగా జరగాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అయితే పార్టీకి చెందిన 13 మంది మంత్రులు, సలహాదారులు, ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు తన వ్యక్తిత్వాన్ని అనుమానించే రీతిలో మాట్లాడుతుంటే తప్పని పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తోందని రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన అన్నారు.