అంతా బాగానే సాగుతుంది అనుకుంటున్న సమయంలో జగన్ కు ఇంటా బయటా కూడా ఒక సమస్య రోజు రోజుకీ తీవ్ర రూపం దాల్చుతుంది! అదే… ఇసుక సమస్య! ఈ సమస్యపై ప్రతిపక్షాలు రోజూ మైకుల ముందుకు, ట్విట్టర్ లలోకి వచ్చి విమర్శలు గుప్పిస్తుంటే… స్వపక్షంలో విపక్ష పాత్ర పోషిస్తున్న కొందరు వైకాపా నేతలే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు జగన్ కు ఇసుక సమస్య అనేది… ఇంటా బయటా సమస్యగా మారిపోయింది. దీంతో దీనికి తనమార్కు పరిష్కారం ఒకటి ఆలోచించారట జగన్!
ఇసుక బుకింగ్ ఆన్ లైన్ చేసినా కూడా విమర్శలు తప్పని పరిస్థితి ఇప్పుడు జగన్ ది! ఇక రోజు రోజుకీ ఈ సమస్య తీవ్రమవుతున్న నేపథ్యంలో… జగన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్ లు నిర్వహించేందుకు నిర్ణయించారట. ఇసుక సమస్యపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఇక అధికారిక ఉత్తర్వులు వెలువడవడమే ఆలస్యం… అనంతరం సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్ చేసుకునే అవకాశం వుంటుంది. ఈ విషయాలపై కూడా నిఘాపెట్ట నిర్ణయించిన జగన్… వినియోగదారులు సచివాలయం ద్వారా ఇసుక బుకింగ్ చేసుకున్నట్లయితే స్థానికంగా వున్న సచివాలయ సిబ్బంది నిజమైన అవసరానికే సదరు బుకింగ్ జరుగుతోందో లేదో అనేది క్షేత్రస్థాయిలో పరిశీలించేలా ఏర్పాట్లు చేస్తున్నారట. దీనివల్ల బ్లాక్ మార్కెట్ లో ఇసుక అమ్మే అవకాశం ఉండదన్నమాట!
కాగా… ఏపీలో ప్రస్తుతం రోజుకు సగటున 1.25 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే వీటిని రోజుకు మూడు లక్షల మెట్రిక్ టన్నులకు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఈ నెల ఆరో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.61 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుకను తవ్వితీయగా.. దానిలో డోర్ డెలివరీ ద్వారా 33 లక్షల ఎంటిలు, ఇతర వినియోగదారులకు 53 లక్షల ఎంటిలు అందించారు.