ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల నేతలు ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకున్న తరుణంలో ప్రధాని మోడీ, కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి ఏపీ సీఎం జగన్ లేఖలు రాశారు. కృష్ణా జలాల వివాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు వేరు వేరుగా ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు.
తెలంగాణతో జరుగుతున్న నీటి పంచాయతీ పై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఐదు పేజీల లేఖ రాసిన జగన్… కృష్ణ నదీ యాజమాన్య బోర్డు కు ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి రాసిన మూడు లేఖలు, తెలంగాణ జెన్ కో కు రాసిన లేఖ, విద్యుత్ ఉత్పత్తి కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓ కాపీ ని లేఖకు జత చేసారు. తెలంగాణ రాష్ట్రం అక్రమంగా నీళ్లను ఉపయోగిస్తోందని ప్రధానికి ఫిర్యాదు చేసారు సీఎం జగన్.
కేఆర్ఎమ్‌బీ అనుమతి లేకుండా విద్యుత్ ఉత్పత్తి కోసం నీటి వినియోగాన్ని నిలిపివేసే విధంగా తెలంగాణ కు ఆదేశాలు జారీ చేయాలని లేఖలో కోరారు. తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతోన్న నీటి పంచాయతీలో ప్రధాని జోక్యాన్ని కోరిన సీఎం జగన్… కేఆర్ఎంబీ పరిధిని ఫిక్స్ చేయాలని విన్నవించారు. ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద సీఐఎస్ఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలని జగన్ విజ్ఞప్తి చేశారు.