తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్నచూపు తగదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంతోషంగా ఉంటామనుకున్న కార్మికులు.. మన పరిపాలనే మనకు శాపమైందా అని బాధపడుతున్నారని అన్నారు.
ఆర్టీసీ ప్రైవేట్ పరమైతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారని జగ్గారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రైవేటీకరణ చట్టం తేవడంతో రాష్ట్రాలకు అవకాశం ఇచ్చినట్లయిందని విమర్శించారు. కేసీఆర్ మానవత్వంతో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కార్మికుల పట్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే కేసీఆర్‌కే చెడ్డపేరు వస్తుందని జగ్గారెడ్డి అన్నారు.