తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో గత ఏడెనిమిది నెలల కాలంలోనే అదిరిపోయే ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టిఆర్ఎస్ వరుసగా రెండోసారి అప్రతిహత విజయంతో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కేవలం 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే విజయం సాధించారు. ఆ తర్వాత 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విడతలవారీగా అధికార టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేసేశారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సైతం కారు ఎక్కేశారు.
రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ దిగజారిపోతోంది అనుకుంటున్న టైమ్ లో ఏప్రిల్ లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 3 ఎంపీ సీట్లు సాధించింది. అదే టైంలో బిజెపి సైతం ఎవరూ ఊహించని విధంగా నాలుగు ఎంపీ సీట్లు సాధించి తెలంగాణ రాజకీయాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వీరిలో టిఆర్ఎస్ పాత నేత సంగారెడ్డి ఎమ్మెల్యే టైగర్ జగ్గారెడ్డి సైతం ఇప్పుడు హస్తానికి హ్యాండ్ ఇచ్చి టిఆర్ఎస్ చెంత చేరేందుకు రెడీ అవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
గురువారం జగ్గారెడ్డి అసెంబ్లీ లాబీలో మంత్రి హరీశ్‌రావును కలిశారు. దాదాపు అరగంట పాటు ఇరువురూ చర్చలు జరిపారు. అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన నియోజకవర్గ ప్రజల కోసం 14 ఏళ్ల తర్వాత హరీశ్‌రావుతో మాట్లాడానన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశానన్నారు. తన వినతిపై హరీశ్ సానుకూలంగా స్పందించారని జగ్గారెడ్డి చెప్పారు.
గతంలో జగ్గారెడ్డి టిఆర్ఎస్ పార్టీలో ఉండే వారు. ఆ తర్వాత ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాక హరీష్ రావు – జగ్గారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వీరిద్దరి మధ్యకొన్ని సంవత్సరాలుగా అసలు మాటల్లేవు. తాజా ఎన్నికల్లో జగ్గారెడ్డిని ఓడించేందుకు హరీష్ రావు విఫల ప్రయత్నాలు చేశారు. తాజాగా ఆయన హరీష్‌తో భేటీ కావడంతో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చలు ప్రారంభమయ్యాయి. జగ్గారెడ్డి త్వరలోనే అధికారికంగా గులాబీ గూటికి చేరి పోతారని… పార్టీ మారితే అక్కడ ఇచ్చే ప్రాధాన్యత పైనే హరీష్ రావుతో చర్చలు జరిపారని వార్తలు వెలువడుతున్నాయి. ఏదేమైనా టిఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన జగ్గారెడ్డి మరోసారి అదే పార్టీలో చేరడంలో ఆశ్చర్య పడాల్సిన పనిలేదు.