తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తల తిక్క ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో రైతులు నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంత్రిత సాగు పిచ్చి నిర్ణయంతో రైతులకు నష్టం జరిగిందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఇప్పటివరకు రైతులకు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులు అని విజయశాంతి ప్రశ్నించారు. రైతులు పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటున్న సీఎం కేసీఆర్.. రైతు బంద్ పెట్టి ఎందుకు సతాయించారని విజయశాంతి విమర్శించారు.
కాగా, తెలంగాణలో నియంత్రిత సాగు విధానం రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఇకపై రైతులు తమకు నచ్చిన పంట వేసుకోవచ్చని సర్కార్ స్పష్టం చేసింది. గ్రామాల్లో కూడా పంట కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది….
కొన్ని నెలల క్రితం తెలంగాణలో వానకాలంలో నియంత్రిత సాగు విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తీసుకొచ్చింది. అందరూ ఒకే రకమైన పంటలు వేయకుండా.. డిమాండ్ ఉన్న పంటలనే వేయాలని గతంలో సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు. అప్పుడే మంచి లాభాలు వస్తాయని పదే పదే విజ్ఞప్తి చేశారు. వానాకాలంలో మొక్కజొన్న పంటలను వేయవద్దని..దాని స్థానంలో పత్తి, కందులు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. కానీ వర్షాకాలం సీజన్ ముగిసి.. యాసంగి పంటకు రైతులకు సిద్ధమవుతున్న వేళ.. నియంత్రిత సాగుపై సీఎం కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారు. రాష్ట్రంలో నియంత్రిత సాగు అవసరం లేదని స్పష్టం చేశారు. రైతులు ఇక నుంచి తమకు నచ్చిన పంటను పండించవచ్చని.. నచ్చిన చోట అమ్ముకోవచ్చని తెలిపారు.
అటు గ్రామాల్లలో పంటలు కొనుగోలు కేంద్రాల్లో పంట కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రైతులు నష్టపోవద్దనే మానవతా దృక్పథంతో ప్రభుత్వం గ్రామాల్లోనే సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, పంటలను కొనుగోలు చేసిందని పేర్కొంది. ప్రతిసారి అలాగే చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని.. రైస్ మిల్లరో, దాల్ మిల్లరో కాదని తెలిపింది. కొనుగోళ్లు – అమ్మకాలు ప్రభుత్వం బాధ్యత కాదు కాబట్టి వచ్చే ఏడాది నుండి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం సాధ్యపడదని వెల్లడించింది. దేశంలో అమలవుతున్న కొత్త చట్టాలు కూడా రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయని… కాబట్టి ప్రభుత్వమే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది