ఏమాటకామాట చెప్పుకోవాలంటే… జేసీ బ్రదర్స్ కి ఇంకా జ్ఞానోదయం అయినట్లుగా లేదు అనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి! అప్పుడే జైలు నుంచి బెయిల్ పై విడుదల అవుతారు.. మళ్లీ రూల్స్ కి వ్యతిరేకంగా నడుచుకుంటారు.. మరో కేసులో మళ్లీ లోపలికెళ్తారు! సరే తమ్ముడి పరిస్థితి అలా ఉంటే… అన్న కాస్త చల్లబడ్డాడు అనుకుంటున్న దశలో మళ్లీ నోటికి పనిచెప్పారనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి!
అవును… జనాలను బెదిరిస్తున్నారో లేక ప్రభుత్వ పెద్దలకు హెచ్చరికలు చేస్తున్నారో లేక ప్రభుత్వ అధికారులను బ్లాక్ మెయిల్ చేయాలని తపిస్తున్నారో తెలియదు కానీ… ఇది ప్రజాస్వామ్యం అన్న విషయం మరిచి నోటికివచ్చినట్లు మాట్లాడుతున్నారు జేసీ దివాకర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన వదిలిన కొన్ని వాక్భాణాలు.. వాటి అర్ధాలు ఇప్పుడు చూద్దాం!
ముందుగా జేసీ అన్న మాటలు… “మా ప్రభుత్వం వస్తే మేం కాదు.. మా కార్యకర్తలు అధికారులను వదలరు” అని! అంటే ఆయన మాటల ఉద్దేశ్యాలేమిటో ఆయనకే తెలియాలి. అధికారులను వదలరు అంటే దాన్ని బెదిరింపుకాక మరేమనాలి. ఇలా ప్రభుత్వ అధికారులపై నోరుచేసుకున్నందుకు జేసీ దివాకర్ రెడ్డిపై ఇంకా కేసులు ఎందుకుపెట్టలేదో పోలీసులకే తెలియాలి!
ఇక రెండోమాట… “ఈ గవర్నమెంట్లో ఎవరూ కూడా రూల్స్ రెగ్యులేషన్స్‌ను పాటించట్లేదు.” అని! రూల్స్ రెగ్యులేషన్స్ సరిగ్గా పాటించకపోవడం.. ఆ విషయం గత ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్లే కదా… నేడు తమ్ముడు ప్రభాకర్ రెడ్డి అరెస్టయ్యింది! రూల్స్ & రెగ్యులేషన్స్ పాటించన ప్రభుత్వం మారిపోయిందనేది జేసీ ఆగ్రహానికి కారణమేమో!!
ఇక మూడోమాట… “ఇక్కడ లాఠీ చేసి మాకు సత్కారం చేస్తున్న వారు బతికేవుంటారు. వీళ్లకు సత్కారం డెఫినెట్‌గా ఇస్తాం. ” ఇంతకు మించిన బెదిరింపు పోలీసులకు – ప్రభుత్వానికి ఉంటుందా అనేది మరికొందరి మాట! మేము అధికారంలోకి వచ్చేసరికి ఇప్పుడున్న అధికారులు బ్రతికే ఉంటారు.. వాళ్ల సంగతి చూస్తాం అన్నట్లుగా మాట్లాడితే… జేసీ ప్రజాస్వామ్యానికి ఇస్తున్న విలువ ఏమిటో స్పష్టంగా అర్ధం అవుతుంది!!
ఇవన్నీ ఒకెత్తు అయితే… ఇక్కడ మరో మాట మాట్లాడారు జేసీ! “అతి తొందర్లోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వస్తుంది. పాలకులు ఇంతకన్నా నాలుగింతలు దుర్మార్గులు వస్తారు” అని! ప్రజాస్వామ్య పాలన రావడం ఏమిటి? నాలుగింతల ఎక్కువ దుర్మార్గులు రావడం ఏమిటి? అయితే ప్రజాస్వామ్యం అయినా రావాలి.. లేదా దుర్మార్గులు అయినా రావాలి! అంటే… నెక్స్ట్ టీడీపీ అధికారంలోకి వస్తుంది.. అప్పుడు జగన్ కంటే నాలుగింతల దుర్మార్గుడు అయిన చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారనా? జేసీనే ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు చంద్రబాబు అభిమానులు!!
-CH Raja