ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ సీనియర్ రాజకీయ నేతలైన జేసీ బ్రదర్స్ కు నిద్రపట్టడం లేదు! జేసీ ట్రావెల్స్ అక్రమాల కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి సుమారు 54రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపి తాజాగా విడుదలయ్యారు.
ఈ సమయంలో మీడియాతో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి… తాము వైసీపీలో చేరేందుకు రెడీ.. అయితే కొన్ని షరతులు ఉన్నాయని అన్నారు! అవేమంటే… అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే.. తాము వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నమని, అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కూడా రెడీ అని వెల్లడించారు.
అదేవిధంగా.. సీఎం జగన్ రాజధానిని అమరావతిలోనే ఉంచితే.. ఆయనకు కండువా కప్పి గజమాలతో సత్కరిస్తానని ప్రకటించారు. తన కుమారుడితో కలిసి 54 రోజుల జైలు జీవితం గడిపి.. షరతులతో కూడిన బెయిల్ పై విడుదలయ్యారు ప్రభాకర్ రెడ్డి. అయితే తాను ఇప్పుడు తాడిపత్రి ప్రజల్లో ఎన్నడూ చూడని కొత్త ఉత్సాహాన్ని చూశానని… గతంలో ఎప్పుడూ ఇంటి నుంచి బయటికి రాని మహిళలు కూడా ఇప్పుడు బయటకు వచ్చి హారతలు పట్టారని అన్నారు.
అంతేకాకుండా జేసీ బ్రదర్స్ మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గతంలో ఎన్టీఆర్ తమకు 11రోజుల పాటు జైల్లో పెడితే… ఇప్పుడు జగన్ 54రోజుల పాటు జైల్లో పెట్టారని గుర్తు చేశారు. అధికారం ఉంటే ఎవరినైనా జైల్లో పెట్ట వచ్చని.. అందుకు తగిన కారణాలు ఏం అక్కరలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి వివరించారు!