నిజామాబాద్ జిల్లాలో జేఈఈ మెయిన్ పరీక్షలో గందరగోళం చోటుచేసుకుంది. పరీక్షకు అరగంట ముందు సెంటర్ ఛేంజ్ చేయడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే మరో పరీక్షా కేంద్రానికి పరుగులు తీశారు. కొందరిని అధికారులు వాహనాల్లో కొత్త కేంద్రానికి తరలించారు. చివరి నిమిషంలో పరీక్షా కేంద్రానికి వచ్చిన విద్యార్థులను మాత్రం అక్కడే పరీక్ష రాయించారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్‌లోని క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన జేఈఈ మెయిన్ పరీక్ష కేంద్రం మార్పు చేస్తున్నట్లు కొంతమంది విద్యార్థులకు చివరి నిమిషంలో సమాచారం వచ్చాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 28 మంది విద్యార్థులకు నిజామాబాద్ మాణిక్ బండారు వద్ద ఉన్న కాకతీయ ఉమెన్స్ కాలేజ్ కు మారుస్తున్నట్లు సమాచారం చివరి నిమిషంలో వచ్చింది. అది చూసుకోక విద్యార్థులు ఈ పరీక్షా కేంద్రానికి రెండు రోజుల ముందు డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో వెళ్లారు. పరీక్షా కేంద్రం మార్చినట్లు చెప్పిన ఎన్‌టీఏ అధికారులు.. అక్కడ రెండు వాహనాలను ఏర్పాటు చేసి కొంతమందిని నిజామాబాద్ కేంద్రానికి తరలించారు. చివరి నిమిషంలో వచ్చిన ఇద్దరికీ అక్కడే రాసేందుకు వీలు కల్పించారు.
ఎన్‌టీఏ అధికారుల నిర్వాకంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఇలాంటి నిర్ణయాలు తమ పిల్లల భవిష్యత్‌ను దెబ్బతీస్తాయని మండిపడ్డారు. మరోవైపు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని కళాశాల వైస్ ప్రిన్సిపల్ నరేందర్ తెలిపారు. మొత్తం 51 మంది ఆ సెంటర్‌లో ఇవాళ పరీక్షకు హాజరైనట్లు చెప్పారు.