స్వాతంత్ర్యం వచ్చి 75 యేళ్లు అయినా రాజ్యాంగంపై దాడులు జరుగుతున్నాయని అన్నారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..దేశంలో సంక్షోభం తీవ్రంగా పెరిగిపోతుందన్నారు. దేశంలో మతోన్మాద ఘర్షణలు పెంచి పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.విదేశాల్లో గాంధీ పేరుతో, దేశంలో గాడ్సే పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
దేశ ప్రజలపై ఆర్ధిక దాడి జరుగుతోందని, 62% యువతకు ఉద్యోగాలు లేవని మండిపడ్డారు.కోట్ల మందికి బ్రతుకుదెరువు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారుల లాభాలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. కేంద్రం ఏజెన్సీల ద్వారా ప్రతిపక్షాలను బ్లాక్ మెయిల్ చేస్తోందని అన్నారు.చరిత్రను వక్రీకరించి బీజేపీ బలపడాలని చూస్తోందని మండిపడ్డారు.వామపక్షాలను బలపరచి, కేంద్రంపై పోరాడుతామని తెలియజేశారు సీతారాం ఏచూరి.