ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఎక్కడా ఎప్పుడూ చూడలేదు. అవును.. ఏ పార్టీలోకి అయినా ఎన్నికల నోటిఫికేషన్ ముందు వలసలు ఉంటాయి. మరీ అంటే నామినేషన్ ముందు వలసలు ఉంటాయి. నామినేషన్లు అయిపోయి… ఇంకో 9 రోజుల్లో ఎన్నికలు పెట్టుకొని ఎవ్వరూ పార్టీని మారరు. ఎందుకంటే పార్టీ మారినా వేస్ట్. టికెట్ దొరకదు. అయితే.. ఏపీలో మాత్రం అటువంటి పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయి.
టీడీపీకి చెందిన ప్రముఖులు ఇప్పటికే వైఎస్సార్సీపీకి క్యూ కట్టారు. మరోవైపు సినీ గ్లామర్ కూడా వైఎస్సార్సీపీకి తోడవుతోంది. ఇప్పటికే జయసుధ, అలీ, రాజా రవీంద్ర, రోజా వైఎస్సార్సీపీ పార్టీలో ఉన్నారు. తాజాగా యాక్షన్ నటుడు రాజశేఖర్, ఆయన భార్య జీవిత వైఎస్సార్సీపీలో చేరారు.
ఇవాళ హైదరాబాద్ లో లోటస్ పాండ్ లో జగన్ ను కలిసిన వాళ్లు వైఎస్సార్సీపీలో చేరారు. ఈసందర్భంగా జగన్.. వారికి వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
సొంత గూటికి వచ్చినట్టుంది…
వైఎస్సార్సీపీలో చేరడం చాలా ఆనందంగా ఉందని… తిరిగి సొంతగూటికి వచ్చినట్టు ఉందన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని రాజశేఖర్ అన్నారు. ఇదివరకు జగన్ తో విభేదాలు ఉన్న మాట వాస్తమే కానీ.. గతం గత:.. ఆ ఘటనలన్నింటినీ మరిచిపోయా. ఇదివరకు జగన్ వేరు.. ఇఫ్పటి జగన్ వేరు. ఆయనకు ఎన్ని కష్టాలు వచ్చినా జనం వెంటే నడుస్తున్నారు. వేల కిలోమీటర్లు పాద యాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు.. అని రాజశేఖర్ వెల్లడించారు.
రాజశేఖర్, జీవిత.. ఇద్దరు 2009లో జగన్ తో కలిశారు. తర్వాత జగన్ తో కొన్ని విభేదాల వల్ల ఆయన్ను వదిలేసి… బీజేపీలో చేరారు. తర్వాత కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న వీళ్లు.. గత సంవత్సరం చంద్రబాబును కలిసి టీడీపీకి తమ మద్దతు పలికారు. తాజాగా మళ్లీ సొంతగూటికి చేరారు.