విమానాయాన దిగ్గజ సంస్థ జెట్ ఎయిర్‌వేస్ గత మూడేళ్లుగా తన సర్వీసులను నిలిపి వేసింది. అయితే.. మూడేళ్ల నుంచి నిలిచిపోయిన జెట్ ఎయిర్‌వేస్ విమాన సర్వీసులు త్వరలో పునఃప్రారంభం కానున్నాయి. మళ్లీ విమానాలు నడుపుకొనేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా విమానయాన సంస్థకు ఈ నెల మొదటివారంలో భద్రతాపరమైన అనుమతులు కూడా మంజూరు చేసింది. దీంతో వచ్చే సెప్టెంబర్ నుంచి జెట్ ఎయిర్‌వేస్ విమాన సేవలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.
జెట్ ఎయిర్‌వేస్ సంస్థను నరేష్ గోయల్ కొనుగోలు చేశారు. అయితే, ఆ తర్వాత ఆర్థిక నష్టాలు, అప్పుల మూలంగా సంస్థ నిర్వహణ కష్టమైంది. సిబ్బందికి వేతనాలు చెల్లించేందుకు, నిర్వహణ కోసం కూడా నిధులు లేని పరిస్థితి. దీంతో 2019, ఏప్రిల్ 17 నుంచి జెట్ ఎయిర్‌వేస్ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీని కారణంగా దాదాపు 20,000 మంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. అప్పట్నుంచి సంస్థ నిధుల కోసం ప్రయత్నిస్తూనే ఉంది. గత జూన్‌లో బ్రిటన్, యూఏఈకి చెందిన సంస్థలు నిధులు సమకూర్చేందుకు ముందుకొచ్చాయి.