జిమ్ కార్బెట్ జాతీయ పార్కు.. సఫారీలకు సంవత్సరం మొత్తం అనుమతి.

-

కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయిన వాటిల్లో పర్యాటకమే ప్రధానంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎక్కడివాళ్ళు అక్కడే ఉండిపోవడంతో పర్యాటకం డీలా పడిపోయింది. మొదటి వేవ్ పోయింది అనుకునేలోపే సెకండ్ వేవ్ భారీ షాకిచ్చింది. ఈ నేపథ్యంలో మరీ ఎక్కువ నష్టాలను చవి చూసింది. ఐతే తాజాగా సెకండ్ వేవ్ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా ఓపెన్ అవుతూ వస్తున్నాయి. అందులో భాగంగానే ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కు తెర్చుకోనుంది.

సంవత్సరం మొత్తం సందర్శనకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు జిమ్ కార్బెట్ డైరెక్టర్ రాహుల్ చెప్పుకొచ్చారు. జిమ్ కార్బెట్ లోని 5ప్రాంతాలైన గర్జియా, బిజ్రని, ధారా- జీర్ణా, డేలా, పాఖ్రోన్ లను సందర్శించడానికి అనుమతులు ఇచ్చింది. దీనివల్ల జాతీయ పార్కు మీద ఆధారపడ్డ వారందరికీ మేలు జరుగుతుందని, వన్య మృగాలను ప్రేమించే వారు సందర్శనకు వస్తారని అంటున్నారు. మంగళవారం రోజున 50బుకింగ్స్ వచ్చాయని తెలిపారు.

ఇప్పటి నుండి సంవత్సరం మొత్తం జిమ్ కార్బెట్ కి సఫారీ వెళ్ళవచ్చని, ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ వెల్లడి చేసింది. ఐతే మరికొంత మంది వన్యమృగ ప్రేమికులు మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. మనుషులు అడవుల్లోకి వెళితే జంతువులకు వైరస్ వచ్చే ప్రమాదం ఉందని, అది మంచిది కాదని వారు హెచ్చరిస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే జంతుప్రదర్శనశాలల్లో సింహాలకు కరోనా వైరస్ వచ్చిన సందర్భాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా ఇదే కాదు దేశ వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలు ఒక్కొక్కటిగా తెరుచుకోనున్నాయి. స్మారక కట్టడాల సందర్శనకు అనుమతి లభించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news