వైఫై వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభ తేదీని ఏజీఎమ్ 2023( ఏజీఎం 2023) వార్షిక సమావేశాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అధికారికంగా ప్రకటించారు. దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 19 నుంచి జియో ఎయిర్ ఫైబర్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా 5జీ హాట్‌స్పాటైనా జియో ఎయిర్ ఫైబర్‌ను గత ఏజీఎమ్ వార్షిక సమావేశాల్లోనే ప్రకటించారు. కానీ అది ఎప్పటి నుంచి అందుబాటులో ఉండేది అప్పుడు వెల్లడించలేదు.
కొత్త ఇండియా పూర్తి ఆత్మస్థయిర్యంతో ఉందని, ఈ ఇండియాను ఎవరూ ఆపలేరని, ఓ లీడింగ్ దేశంగా ఇండియా ఎదుగుతుందని, జీ20 సమావేశాలకు ఇండియా వేదిక కావడం చరిత్రాత్మకం అని ఆయన అన్నారు. గత అక్టోబర్‌లో 5జీ సేవల్ని స్టార్ట్ చేశామని, ఇప్పుడు ఆ సేవలు 96 శాతం పట్టణాల్లో అందుబాటులో ఉందని, ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఆ సేవల్ని యావత్ దేశానికి అందేలా చూస్తామని రిలయన్స్ అధినేత తెలిపారు. రిలయన్స్ ఎగుమతులు ఈ ఏడాది 33.4 శాతం పెరిగాయని, అది 3.4 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. జియో నెట్వర్క్ ద్వారా ప్రతి నెలకు దేశవ్యాప్తంగా 1100 కోట్ల జీబీ డేటాను వాడుతున్నట్లు ఆయన చెప్పారు.