ఇటీవల అగ్రరాజ్య గగనతలంలో చైనా నిఘా బెలూన్ సంచరించిన విషయం తెలిసిందే. అమెరికా రక్షణ దళాలు ఈ బెలూన్‌ను కూల్చివేశాయి. ఈ ఘటనలో చైనాకు క్షమాపణలు చెప్పే ఉద్దేశం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తేల్చి చెప్పారు. అలాగే తాను త్వరలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తో మాట్లాడే అవకాశం ఉందని తెలిపారు.
‘త్వరలో అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడతానని భావిస్తున్నాను. మేం సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధాన్ని కోరుకోవడం లేదు. బెలూన్ కూల్చివేసిన విషయంలో క్షమాపణలు చెప్పే ఉద్దేశం లేదు. అమెరికా ప్రజల ప్రయోజనాలు, భద్రతకే మా మొదటి ప్రాధాన్యం’ అని స్పష్టం చేశారు. అమెరికా గగనతలంపై ప్రయాణించిన ఓ చైనా బెలూన్‌ను అగ్రరాజ్యం కూల్చివేయగా.. అది వాతావరణ పరిశోధన కోసమే ప్రయోగించామని చైనా చెప్పింది.
అది గూఢచర్య బెలూన్ అని విశ్వసించిన అమెరికా యుద్ధ విమానాన్ని పంపించి తమ దేశ తీరానికి సమీపంలోని అట్లాంటిక్ మహా సముద్రంలో కూల్చివేసింది. అది కూలిన ప్రదేశంలో సెన్సర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను గుర్తించినట్లు యూఎస్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది.