తెలంగాణ భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక నుంచి జోగులాంబ అమ్మవారి ఆలయ సేవలు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇవాళ హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో జోగులాంబ అమ్మవారి ఆలయ వెబ్ సైట్ ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఆవిష్కరించారు. ఆలయ ఆన్ లైన్ సేవలను ప్రారంభించారు.
రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో దశలవారీగా ఆన్‌లైన్ సేవలను విస్తరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడంతోపాటు వారి సౌకర్యార్ధం ఇప్పటికే 36 ప్రధాన ఆలయాల్లో ఆన్‌లైన్‌లో పూజలు, వసతి బుకింగ్, ప్రసాదం పంపిణీ, తదితర సేవలను భక్తులకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఈ వెబ్ సైట్ వల్ల అమ్మవారి సేవలను పారదర్శకంగా, సులభంగా పొందగలుగుతారని చెప్పారు.
దశలవారీగా ఆన్‌లైన్ సేవలను విస్తరిస్తామని, అందులో భాగంగానే జోగులాంబ అమ్మవారి ఆలయంలో ఆన్‌లైన్ సేవలను ప్రారంభించామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. భక్తుల సేవలు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లో కూడా కొనసాగుతాయని స్పష్టం చేశారు.