వైసీపీకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మద్ధతు పెరిగిందా.. కారణం అదేనా?

-

ఏపీలో వైసీపీకి రోజు రోజుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మ‌ద్ద‌తు పెరుగుతుందా ?  అలాగే ఎన్టీఆర్‌కు కూడా వైసీపీ అభిమానులు ఫుల్‌గా స‌పోర్ట్ చేస్తున్నారా ? ఇప్పుడు ఈ రెండిటికి ఏపీలో అవినాభావ సంబంధం ఉంది. మొన్న ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడం, చంద్రబాబుకు వయసు మీద పడటం,  పార్టీలో లోకేశ్ పెత్తనం పెరిగిపోవడం లాంటి పరిణామాలతో కొందరు టీడీపీ నేతలు తమ భవిష్యత్తు ఏంటని అయోమయం పరిస్థితిలో ఉన్నారు. టీడీపీలో ఉంటే తమ కొంప మునగడం ఖాయమని అనుకుంటున్నారు. అందుకే మెల్ల మెల్లగా టీడీపీకి దెబ్బ వేసి వైసీపీలోకి వెళ్ళేందుకు చూస్తున్నారు.

ఇప్పటికే పలువురు నేతలు టీడీపీలో ఉంటే భవిష్యత్తు ఉండదని, లోకేష్‌ వల్ల పార్టీ నాశనం అయిపోయిందని వైసీపీ, బీజేపీల్లోకి వెళ్ళిపోయారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నేతలే కాకుండా ఎన్టీఆర్ ని అభిమానించే టీడీపీ మద్ధతుదారులు కూడా వైసీపీ వైపు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు నుంచే ఈ ప్ర‌క్రియ స్టార్ట్ అవ్వ‌గా.. ఇప్పుడు అది మ‌రింత ఎక్కువైంది. కాకపోతే 2009లో ఎన్టీఆర్ టీడీపీకి ప్రచారం చేసినప్పుడు వారి ఫుల్ సపోర్ట్ టీడీపీకే ఉండేది. కానీ ఎప్పుడైతే ఎన్టీఆర్ టీడీపీకి దూరమయ్యారో అప్పటి నుంచి వారు కూడా దూరం కావడం మొదలుపెట్టారు.

పైగా టీడీపీ అధినేత చంద్రబాబు..ఎన్టీఆర్ కుటుంబాన్ని పార్టీ దరిదాపుల్లోకి రానివ్వకపోవడంతో మరింత మంది కోపంతో జగన్ కు మద్ధతు ఇవ్వడం మొదలుపెట్టారు. కావాలనే ఎన్టీఆర్ ని వాడుకుని వదిలేశారనే భావనతో చాలామంది ఎన్టీఆర్ అభిమానులు టీడీపీకి దూరమైపోయారు. ఇంకా చెప్పాలంటే చంద్ర‌బాబు త‌న కుమారుడిని ప్ర‌మోట్ చేసుకునేందుకు ఎన్టీఆర్ ఫ్యామిలీని ఈ ఎన్నిక‌ల‌కు ముందు పూర్తిగా ప‌క్క‌న పెట్ట‌డం కూడా నంద‌మూరి హార్ట్‌కోర్ అభిమానుల‌కే న‌చ్చ‌లేదు. ఇక ఎన్నిక‌ల‌కు ముందే ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస‌రావు సైతం వైసీపీలోకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఇక తాజా పరిణామాలతో మరింత మంది వైసీపీ వైపు వెళ్ళినట్లు తెలుస్తోంది.

ఇటీవల ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉండే వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. వంశీ వెళ్ళేప్పుడు లోకేశ్ వల్ల పార్టీ నాశనం అవుతుందని, ఎన్టీఆర్ ని వాడుకుని వదిలేశారని మాట్లాడారు. అలాగే మంత్రి కొడాలి నాని కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ పరిణామాలని బట్టి చూస్తే టీడీపీలో లోకేశ్ పెత్తనం పెరిగిపోయింది. కాబట్టి భవిష్యత్తులో టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ కు వచ్చే అవకాశం లేదు. దీంతో ఇప్పటివరకు మద్ధతుగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు జగన్ కు జై కొడుతున్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మళ్ళీ ఆయన వెంట నడిచే అవకాశముంది. అప్పటివరకు ఎన్టీఆర్ అభిమానులు వైసీపీ వైపే ఉంటార‌న‌డంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news