తెలంగాణలోని 6 ఎయిర్ పోర్టుల ఏర్పాటుపై జ్యోతిరాదిత్య శుభవార్త !

-

దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆర్ధిక అభివృద్ధి కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతున్నందున వివిధ దేశాల నుంచి హైదరాబాద్ కు విమాన ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో.. హైదరాబాద్ (శంషాబాద్) అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హామీ ఇచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న మరో 6 ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి సింధియా స్పష్టం చేశారు. తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన కేంద్రమంత్రి సింధియా శనివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేంద్రమంత్రి గౌరవార్ధం.. సీఎం కేసీఆర్ ఆయనను మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. అనంతరం జరిగిన భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఎకానమిక్ గ్రోత్ సెంటర్ గా అభివృద్ధి చెందడంతోపాటు, హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీగా రూపుదిద్దుకుంటున్నందున, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి, వివిధ దేశాలకు విమానయాన సౌకర్యాలను మరింతగా మెరుగు పరచాలని కేంద్రమంత్రిని కోరారు.

బిజినెస్ హబ్ గా, ఐటీ హబ్ గా, హెల్త్ హబ్ గా, టూరిజం హబ్ గా హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం ఇంకా విస్తరిస్తుండటంతో దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు, పలు అంతర్జాతీయ నగరాల నుండి ప్రయాణికులు వస్తున్నందున సౌత్ ఈస్ట్ ఏషియా, యూరప్, యూఎస్ లకు హైదరాబాద్ నుండి డైరెక్ట్ ఫ్లైట్స్ కనెక్టివిటీని పెంచే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కేంద్రమంత్రి సింధియా దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతిపాదనలో ఉన్న వివిధ పట్టణాల్లోని 6 ఎయిర్ పోర్టుల అభివృద్ధి ఆపరేషన్స్ కోసం వెంటనే చర్యలు తీసుకొని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి తగిన సహకారం అందించాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రిని కోరారు.

హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో కనెక్టివిటీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి సింధియా.. దేశంలో దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్ లో హైదరాబాద్ ఎయిర్ పోర్టు ఇంకా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉన్నదని కేంద్రమంత్రి సింధియా అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news