టిఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

టిఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. ప్రజా సేవ చేయడానికి పదవులు, ప్రోటోకాల్ అవసరం లేదని ఎమ్మెల్యే రాజయ్యని కడియం శ్రీహరి విమర్శించారు.జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో CMRF చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. మొన్నీ ఈ మధ్యే కడియం శ్రీహరి పదవీకాలం జూన్ 2న ముగిసిందని కడియంకు ప్రొటోకాల్ లేదని తాటికొండ రాజయ్య అన్నారు. అయితే దీనిపై కడియం శ్రీహరి స్పందించారు. ప్రజసేవ చేయడానికి పదవులు, ప్రొటోకాల్ అవసరం లేదని, నియోజకవర్గానికి రావడానికి ఎవరి లైసెన్స్ , అనుమతి తీసుకోవాల్సిన పనిలేదని ధ్వజమెత్తారు.

తనకి రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు పదవి ఉన్నా, లేకున్నా అందుబాటులో ఉండి సేవ చేయడమే తన లక్ష్యం అన్నారు. ప్రజలకు మేలుచేసే పనులు ఎవరు చేసిన స్వాగతించి, అభినందించాలని పిలుపునిచ్చారు. పార్టీకి కట్టుబడి మాత్రమే ఉంటామని ఆయన తెలిపారు. కడియం శ్రీహరి నిజాయితీగా పని చేస్తాడని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ముందు ఉంటాడని ప్రజల్లో తనకు మంచి గుర్తింపు ఉందని వెల్లడించారు. దేవాదుల సాగునీరు గురించి మాట్లాడని వారు, దేవాదుల పట్ల అవగాహన లేనివారు హడావుడి చేయడం విడ్డురంగా ఉందని ఎద్దేవా చేశారు.