ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు పాడిన ఓ ఇంగ్లీష్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిమాన్షు తొలిసారిగా పాడిన ఈ పాట ఆకట్టుకుంటోంది. తన పాటను యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా హిమాన్షు పంచుకున్నారు.
ప్రసిద్ధ ఆంగ్ల గీతం ‘గోల్డెన్ అవర్’ పాటకు కవర్ సాంగ్‌ను హిమాన్షు పాడగా, దాన్ని మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. తన కుమారుడు పాడిన పాట తనకెంతో నచ్చిందని… అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. హిమాన్షు పాటను ఎమ్మెల్సీ కవిత కూడా మెచ్చుకున్నారు. ‘నిన్ను చూసి గర్వపడుతున్నాను అల్లుడూ! మరిన్ని మంచి పాటలు నీ నుంచి ఆశిస్తున్నాను. దైవానుగ్రహం నీకుండాలి’’ అని కవిత ట్వీట్ చేశారు.
తాత, తండ్రిలాగే హిమాన్షు కూడా రాజకీయాల్లోకి వస్తారని అందరూ ఊహించారు. కానీ ప్రస్తుతం హిమాన్షు అలవాట్లు, ఆసక్తులు చూస్తుంటే తను వేరే మార్గంలో నడిచేలా ఉన్నట్లు కనిపిస్తోందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.