కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ రగడ.. హైకోర్టుకు బాధిత రైతులు

-

కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్‌పై రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమస్యపై బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. మాస్టర్ ప్లాన్‌పై ఉన్నత న్యాయస్థానంలో పలువురు కర్షకులు పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే 500 మందికిపైగా రైతులు మున్సిపల్ కమిషనర్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మిగిలిన రైతులు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

కామారెడ్డి పురపాలక సంఘానికి నూతన బృహత్ ప్రణాళికను రూపొందించే క్రమంలో.. పరిసర ప్రాంతాల్లోని 8 గ్రామాల్లో 2 వేల170 ఎకరాల సాగు భూములను పారిశ్రామిక జోన్‌లో చేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ రెండ్రోజులపాటు రైతులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. మాస్టర్‌ ప్లాన్‌ను నిరసిస్తూ… రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నెల రోజులుగా ఆందోళనలు చేస్తుండగా… రెండ్రోజుల క్రితం అడ్లూర్‌ ఎల్లారెడ్డికి చెందిన రైతు రాములు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆందోళనలకు మరింత ఆజ్యం పోసినట్లైంది.

మరోవైపు రైతులు చేపట్టిన ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్‌లు పూర్తి మద్దతు ప్రకటించాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచన మేరకు కామారెడ్డికి 2 కాంగ్రెస్ బృందాలు తరలివెళ్లాయి. రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు. మాస్టర్‌ ప్లాన్‌పై ప్రజాక్షేత్రంలో సభలు జరిపి రైతులతో చర్చించాలని బీజేపీ, కాంగ్రెస్‌లు డిమాండ్‌ చేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news