రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలూ అత్యంత సహజం! ఈ క్రమంలో ఒక్కోసారి ఇవి పరిధులు దాటుతుంటాయి.. మరికొన్ని సార్లు హుందాగా ఉంటాయి! సాధారణంగా ఇలా విమర్శలు చేసుకున్న నేతలు… సీబీఐ ఎంక్వైరీకో, హైకోర్టు జడ్జితో విచారణకో డిమాండ్ చేస్తారు! ఇంకొన్నీ సార్లు ఎన్నికల ఫలితాలపై కూడా లెక్కలేసుకుంటారు! అయితే… తాజాగా ఏపీలో మాత్రం దేవుడిపై ప్రమాణం చేసి అవినీతి ఆరోపణలపై క్లారిటీ ఇవ్వాలని అంటున్నారు కన్నా లక్ష్మీ నారాయణ – విజయసాయిరెడ్డి! ఈ క్రమంలో కాణిపాకం వినాయయకుడికి ఇది పెద్ద పరీక్షే!!
ప్రస్తుతం ఉన్న కాలంలో దేశంలో అవినీతి చేయని రాజకీయ నాయకులు ఉండరు అన్నా అతిశయోక్తి కాదు అనుకుంటున్న దశలో… ఉన్నా కూడా వేళ్లపై లెక్కించేస్థాయిలోనే ఉంటారని మరో అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో గతంలో మంత్రిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి లు ఒక విషయంపై మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు. అందుకు కారణాలు… వైకాపా పై కన్నా చేసిన ఆరోపణలు కాగా, మరొకటి.. కన్నా లక్ష్మీనారాయణ రూ. 20 కోట్లకు చంద్రబాబుకు అమ్ముడైపోయారనే ఆరోపణ. దీనిపై స్పందించిన విజయసాయిరెడ్డి… కాణిపాకంలో తాను ప్రమాణం చేయడానికి సిద్ధమని ప్రకటించగా… అనంతరం తాజాగా కన్నా లక్ష్మీనారాయణ కూడా లాక్ డౌన్ అనంతరం కాణిపాకంలో ప్రమాణానికి సిద్దమని ప్రకటించారు.
ఈ వాయిదాపై స్పందించిన వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ మాత్రం కన్నాకు మరో బంఫర్ ఆఫర్ ఇచ్చారు. లాక్ డౌన్ తర్వాతే ప్రమాణాలు అని కన్నా తప్పించుకోవడం దేనికి.? ఇప్పుడంటే.. ఇప్పుడు కావాలంటే తామే అనుమతులు ఇప్పిస్తామని.. కాణిపాకంలో ప్రమాణం చేయాలని చెబుతున్నారు!
ఆ సంగతులు అలా ఉంచితే… సపోజ్, ఫర్ సపోజ్ ఇద్దరూ నాయకులూ “విత్ అవుట్ టెరంస్ అండ్ కండిషన్స్” నిజంగా ప్రమాణాలు చేస్తే ఏమి జరుగుతుంది? చంద్రబాబు దగ్గర రూ. 20 కోట్లకు కన్నా అమ్ముడైపోయాడని, ఎన్నికల సమయంలో బీజేపీ అధిష్టాణం ఇచ్చిన సొమ్మును కన్నా మింగేశారని.. ఇది నిజమని విజయసాయి ప్రమాణం చేసేస్తే…! తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా తాను అవినీతి చేయలేదని, ఎన్నికల సమయంలో ఒక్క రూపాయి కూడా తాను ప్రజలకు పంచలేదని, అధిష్టాణం కూడా తనకు ఎన్నికల సమయంలో డబ్బులు ఇవ్వలేదని కన్నా ప్రమాణం చేస్తే…! అప్పుడు అసలు సిసలు పరీక్ష కాణిపాకం వినాయకుడికి కాక మరెవరికి? అందరికీ పరీక్షలు పెట్టే దేవుడికే ఎంత పెద్ద పరీక్ష ఎదురైంది!