కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 135 స్థానాలు గెలుచుకుని విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ ను అంతర్గత సమస్యలు వెంటాడుతున్నాయి. ఫలితాలు వెలువడిన రోజు నుంచి ఇవాళ్టి వరకు సీఎం సీటు గురించి తలలు పట్టుకున్న హస్తం పార్టీ.. సమస్యను ఎట్టకేలకు ఓ కొలిక్కి తీసుకొచ్చింది. అనుభవజ్ఞుడైన సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను ఏకైక ఉపముఖ్యమంత్రిగా నియమించాలని నిర్ణయం తీసుకుంది.
కానీ, అధిష్ఠానం నిర్ణయం కొన్ని వర్గాలకు మింగుడు పడటం లేదు. ఈ నిర్ణయంపై సీనియర్ నేత జి. పరమేశ్వర అసంతృప్తి వెలిబుచ్చారు. దళితులకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే, ఏకైక ఉపముఖ్యమంత్రి ఉంటారంటూ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై ఆయన మండిపడుతున్నారు.
‘‘ తానొక్కరే డిప్యూటీ సీఎంగా ఉండాలని డీకే శివకుమార్ కేంద్రానికి షరతు పెట్టడం ఆయన దృష్టిలో సబబే కావొచ్చు. కానీ, అధిష్ఠానం లోతుగా ఆలోచించాలి. తమ నిర్ణయం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లుతుందో బేరీజు వేసుకోవాలి.’’ అని పరమేశ్వర మీడియాకు తెలిపారు.